ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగస్టు 11 వరకూ 17 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు

national |  Suryaa Desk  | Published : Thu, Jul 20, 2023, 09:15 PM

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కాబోతుండగా.. అధికార, విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్దమయ్యాయి. సార్వత్రిక ఎన్నికలకు మరో 9 నెలలు సమయం ఉండగా.. ఇప్పటి నుంచే పొత్తులు, కూటములకు అధికార, విపక్షాలు తెరలేపాయి. రెండు రోజుల కిందటే అటు బీజేపీ.. ఇటు విపక్షాలు తమ మిత్రులతో సమావేశమైన విషయం తెలిసిందే. బెంగళూరు వేదికగా జరిగిన సమావేశంలో విపక్షాలు తమ కూటమికి ‘ఇండియా’ అనే పేరును ఖరారుచేశాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ Vs ఇండియా మధ్యే పోరు జరగనుంది. ఈ తరుణంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి.


అటు అధికార పక్షం, ఇటు విపక్షాలు పరస్పరం ఇరుకునపెట్టే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా మణిపుర్‌ అల్లర్లపై ప్రధాని మోదీ ఇంతవరకు ఒక్కసారి కూడా స్పందించకపోవడాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. దీనిపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి విపక్షాలు సిద్దమయ్యాయి. అలాగే, ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ), ఢిల్లీ ఆర్డినెన్సు, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, మహిళా రిజర్వేషన్లు, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, రైల్వే భద్రత, సరిహద్దులో పరిస్థితులు వంటి ఇతర అంశాలనూ చర్చకు వచ్చేలా చూడాలని, దానిపై వ్యూహరచనకు సమావేశాలు జరిగినన్ని రోజులూ ప్రతి రోజూ సమావేశం కావాలని ప్రతిపక్ష కూటమి నిర్ణయించింది.


జులై 20 నుంచి ఆగస్టు 11 వరకు మొత్తం 17 పనిదినాల్లో కొనసాగే సమావేశాల్లో 32 అంశాలను సభల్లో ప్రవేశపెట్టాలని మోదీ సర్కారు ప్రతిపాదనలు చేస్తోంది. తొలిరోజు నుంచే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌, టీఎంసీ, డీఎంకే సభ్యులు సమర్పించిన నోటీసులను లోక్‌సభ సెక్రటేరియట్ అనుమతించింది.


మరోవైపు, ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశంపైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం వెల్లడించింది. సమావేశాలు అర్ధవంతగా సాగాలని, అందుకు విపక్షాలు సహకరించాలని కోరింది. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మణిపుర్‌ పరిస్థితులపై మొదటిరోజే ప్రధాని ప్రకటన చేయాలని విపక్ష నేతలు కోరారు. కులగణన, ధరల పెరుగుదల, నిరుద్యోగంలాంటి అంశాలను కూడా పలు పార్టీలు లేవనెత్తాయి. ప్రతి అంశంపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి చెప్పారు.


సమావేశం ప్రారంభమైన వెంటే మణిపుర్‌ అంశంపై వాయిదా తీర్మానం ఇస్తామని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. మణిపూర్‌లో శాంతి నెలకొల్పేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారో పార్లమెంటు ద్వారా దేశ ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్‌ డిమాండ్ చేసింది. సరిహద్దులో చైనా ఆక్రమణ, అటవీ సంరక్షణ సవరణ చట్టం, జీవవైవిధ్య బిల్లు, ఢిల్లీ ఆర్డినెన్స్‌లను వ్యతిరేకించబోతున్నట్లు పేర్కొంది. సభ సజావుగా జరిగేలా చూసుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత ప్రభుత్వంపై ఉందని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ ఉద్ఘాటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa