ఈ రోజున టమోట మనకు బంగారంలా మారింది. ఈ క్రమంలోనే టమోట చోరికీ పాల్పడుతున్నారు దొంగలు. మహారాష్ట్రలోని పుణెలో ఓ రైతు పండించిన 400 కిలోల టమాటా చోరీకి గురైనట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... షిరూర్ తహసీల్‌లోని పింపార్‌ఖేడ్‌కు చెందిన రైతు అరుణ్ ధోమ్ కు చెందిన టమాటాను ఎత్తుకెళ్లారు. ఈ మేరకు ఆయన పుణే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను పండించిన నాలుగు వందల కిలోల టమాటాను ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆదివారం రాత్రి తన ఇంటి బయట పార్క్ చేసిన వాహనంలో 20 డబ్బాల టమోటాను ఆ రైతు ఉంచినట్లు పోలీసులు తెలిపారు. అయితే మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి టమాటా డబ్బాలు కనిపించకుండా పోయాయని, చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికి, తన పంట చోరీకి గురైనట్లు అతను గుర్తించాడన్నారు. దీంతో అతను పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు ఇచ్చారని షిరూర్ పోలీస్ స్టేషన్‌లోని ఒక అధికారి తెలిపారు. ఫిర్యాదు మేరకు గుర్తుతెలియని వ్యక్తులపై చోరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దేశవ్యాప్తంగా టమాటా ధరలు కిలోకు రూ.100కు పైగా చేరిన తరుణంలో టమాటా దొంగతనం వెలుగు చూసింది. టమాటా పండించే ప్రాంతాల్లో వేడిగాలులు, భారీ వర్షం కారణంగా సరఫరా తగ్గిపోవడమే భారీ పెరుగుదలకు కారణం.