కట్నం తీసుకోవడం నేరం. అయినా పెళ్లిళ్లలో ఇస్తూనే ఉంటారు. కొన్ని పెళ్లిళ్లు అయితే కట్నం ఇవ్వలేదని.. పీటల మీదీ ఆపేసిన ఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే చాలమంది పెళ్లిళ్లకు డబ్బు, బంగారం, పొలం, ఆస్తులు, భవనాలు ఇలా అల్లుడికి అత్తింటి వారు ఇస్తుంటారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం వింత సంప్రదాయం ఉంది. పెళ్లి చేసిన తర్వాత.. అల్లుడికి పాములు కట్నంగా ఇస్తున్నారు. అదేంటి అంటే.. ఇది వందల ఏళ్ల సంప్రదాయం అని చెబుతున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని కొర్బా ప్రాంతంలో నివసించే గిరిజన తెగ.. ఈ ఆచారాన్ని పాటిస్తోంది. వివాహంలో భాగంగా సన్వారా అనే తెగలోని పెళ్లికుమార్తె తరఫు కుటుంబ సభ్యులు.. పెళ్లిలో వరుడికి ఈ పాములను కట్నంగా అప్పగిస్తారు. అయితే ఇందులో కూడా మరో విషయం ఉంది. ఇందులో ఒక పామో రెండు పాములో కాకుండా ఏకంగా 21 పాములను అల్లుడికి పెళ్లి కానుకగా ఇస్తుంటారు. ఈ 21 పాములను 9 రకాల జాతులకు చెందిన వాటిని తీసుకువచ్చి ఇవ్వడం మరో విశేషం. ఇక పెళ్లి సమయంలో అల్లుడికి కట్నంగా ఎవరైనా పాములను ఇవ్వకపోతే ఆ పెళ్లిని వరుడి తరఫు బంధువులు రద్దు చేసుకుని వెళ్లిపోతారు.
అయితే ఈ ఆచారాన్ని కొన్ని వందల ఏళ్ల నుంచి తమ పూర్వీకులు పాటించేవారని.. అందుకే తాము కూడా ఇప్పటికే ఇదే సంప్రదాయాన్ని అనుసరిస్తున్నామని.. సన్వారా తెగకు చెందిన వారు చెబుతున్నారు. గతంలో చాలా పాములను పెళ్లి కట్నంగా సమర్పించేవారని తెలిపారు. తమ పూర్వీకులు ఒక పెళ్లిలో వరుడికి ఏకంగా 60 పాములను కట్నంగా ఇచ్చేవారని పేర్కొన్నారు. ప్రస్తుతం పాముల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని.. అందుకే కేవలం 21 పాములను మాత్రమే ఇస్తున్నట్లు చెప్పారు.
ఈ పాములను పెళ్లికి కట్నంగా ఇవ్వడం వెనుక ఉన్న రహస్యాన్ని కూడా వారు వెల్లడించారు. తరతరాలుగా పాములను ఆడించడమే తమ తెగకు చెందిన ప్రధాన జీవన ఆదాయం అని.. పేర్కొన్నారు. అందుకే కొత్తగా పెళ్లయిన జంటకు ఈ పాములను ఇస్తే వారు.. వాటితో తమ కొత్త సంసార జీవితాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. అయితే ఇలా పాములను పెళ్లికి ఇవ్వడంపై అటవీ అధికారులు స్పందించారు. ఎందుకంటే అటవీ చట్టం ప్రకారం.. అటవీ జంతువులను పెంచుకోవడం, వాటిని బంధించడం నేరం. అయితే స్థానిక తెగలోని సంప్రదాయాలను గౌరవించి ఇలా పాములను కట్నంగా ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతులు ఇస్తోందని స్థానిక అటవీ అధికారి ఒకరు వెల్లడించారు.