దేశంలోనే తొలి ప్రయివేట్ హిల్ స్టేషన్ ‘లావాసా’లో ఫ్లాట్‌ల అమ్మకానికి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వందలాది మంది కొనుగోలుదారులు, రుణదాతల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని.. లావాసాలో ఫ్లాట్లను విక్రయానికి డార్విన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు అనుమతి మంజూరు చేసింది. ఫైనాన్సియర్ల రిజల్యూషన్ ప్లాన్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న అనంతరం.. డార్విన్ సంస్థ సమర్పించిన ప్రణాళికను ఎన్‌ఎల్సీటీ ఆమోదించింది. రుణదాతలకు రూ. 929 కోట్లు, కస్టమర్లకు ఇళ్ల నిర్మాణానికి రూ. 438 కోట్లు సహా మొత్తం ఎనిమిదేళ్లలో రూ.1,814 కోట్లు వెచ్చించనున్నట్టు డార్విన్ సంస్థ పేర్కొంది. అలాగే, 837 మంది కొనుగోలుదారులు ముందస్తు చెల్లింపులకు అంగీకరించిన మొత్తం రూ. 409 కోట్లుగా పేర్కొంది.
రుణదాతలు, కార్యాచరణ రుణదాతలతో సహా కంపెనీ అంగీకరించిన మొత్తం వ్యయం రూ. 6,642 కోట్లుగా ఉంటుందని తెలిపింది. ఐదేళ్ల వ్యవధిలో కొనుగోలుదారులకు పూర్తిగా నిర్మించిన గృహాలను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు డార్విన్ రిజల్యూషన్ ప్లాన్‌లో వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్‌లో ఇళ్లను పొందాలంటే కొనుగోలుదారులు డార్విన్ సంస్థకు నిర్మాణ వ్యయంలో కొంత మొత్తాన్ని ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. నిర్మాణ వ్యయం విషయంలో పారదర్శకంగా వ్యవహరించేలా నలుగురు సభ్యులతో కూటి కమిటీని కూడా లా ట్రైబ్యునల్ ప్రతిపాదించింది. ఈ మేరకు ఎన్‌సీఎల్టీ సాంకేతిక, న్యాయశాఖ సభ్యులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ముంబై ప్రధాన కార్యాలయంగా పనిచేసే డార్విన్ గ్రూప్ గతంలో జెట్ ఎయిర్‌వేస్, రిలయన్స్ క్యాపిటల్ బిడ్డింగ్ ప్రక్రియపై ఆసక్తి చూపింది. గ్రూప్ రిటైల్, రియల్టీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇతర వ్యాపార కార్యకలాపాలను ఈ సంస్థ నిర్వహిస్తోంది. యూనియన్ బ్యాంక్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, ఆర్సిల్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకులు దీనికి ప్రధాన రుణదాతలుగా ఉన్నాయి.
పుణే సమీపంలో పశ్చిమ కనుమల్లోని ముల్షి వ్యాలీలో ఉన్న లావాసాను 2010లో హిందుస్థాన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ అభివృద్ధి చేసింది. ఐరోపా తరహా నగరాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. వార్స్‌గావ్ నదిపై ఆనకట్టలు, నగరానికి అవసరమైన మౌలిక సదుపాయాల నిర్మాణ కాంట్రాక్టును లావాసా కార్పొరేషన్ దక్కించుకుంది. ఈ సంస్థ సకాలంలో రుణాలు చెల్లించడంలో విఫలం కావడంతో రుణదాతలలో ఒకరైన రాజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఇండియా లావాసాకు వ్యతిరేకంగా దివాలా పిటిషన్‌ను దాఖలు చేసింది.