ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న వేళ.. రాజస్థాన్‌లో రోజురోజుకూ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే సొంత పార్టీలో సచిన్ పైలట్ వర్గంతో అంతర్గత పోరు ఎదుర్కొంటున్న సీఎం అశోక్ గెహ్లాట్.. తాజాగా ఓ మంత్రిని పదవి నుంచి తొలగించారు. మణిపూర్ ఘటనపై రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు నిరసనలు తెలిపారు. అదే సమయంలో కలగజేసుకున్న మంత్రి రాజేంద్ర గుఢా.. రాజస్థాన్‌లోనే మహిళలకు రక్షణ లేదని అలాంటి వారు మణిపూర్ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మణిపూర్ ఘటనలపై మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నేతలు.. రాజస్థాన్‌లో జరుగుతున్న ఘటనలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సొంత పార్టీ నేత అనడంతో రాజస్థాన్ కాంగ్రెస్‌లో మరోసారి విబేధాలు భగ్గుమన్నాయి. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే రాజేంద్ర గుఢాను మంత్రి పదవి నుంచి సీఎం అశోక్ గెహ్లోట్ తొలగించారు.
మరోవైపు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లాట్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని వ్యాఖ్యలు రాజస్థాన్ ప్రజల ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడ్డారు. అదే సమయంలో రెండున్నర నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నా.. ప్రధాని స్పందించలేదని ధ్వజమెత్తారు. మణిపూర్‌లో అంత హింస జరిగితే కొన్ని సెకన్లలో మాత్రమే మోదీ మాట్లాడారని.. అందులో కూడా రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అంటూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల పేర్లు చెబుతూ రాజకీయం చేశారని విమర్శించారు. ఇలాంటి ప్రధానమంత్రిని తానెప్పుడూ చూడలేదని ఆక్షేపించారు.
విదేశాలకు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటించే ప్రధాని మోదీ.. మణిపూర్‌కు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. కేంద్రంలో, మణిపూర్‌లో బీజేపీ అధికారంలో ఉన్నా ఎందుకు హింసాత్మక ఘటనలను అడ్డుకోలేకపోతున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏదైనా రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరిగితే ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ.. ఏం చేసేదో అని అన్నారు. మణిపూర్‌లో వందకుపైగా అత్యాచార ఘటనలు జరిగాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారన్న అశోక్ గెహ్లాట్.. కానీ దాదాపు 4 వేల ఎఫ్ఐఆర్‌లు నమోదైనట్లు నివేదికలు వెలువడుతున్నాయని చెప్పారు.
మరోవైపు.. మంత్రి పదవి కోల్పోయిన రాజేంద్ర గుఢా.. సీఎం అశోక్ గెహ్లోట్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాజస్థాన్‌లో శాంతి భద్రలను అదుపు చేసేందుకు సీఎం వద్ద ఉన్న హోం మంత్రిత్వ శాఖను.. సమర్థులైన వారికి అప్పగించాలని హితవు పలికారు. రాజేంద్ర గుఢా వ్యాఖ్యలను సమర్థించిన కేంద్రమమంత్రి అనురాగ్ ఠాకూర్.. నిజాలు మాట్లాడే మంత్రిని పదవి నుంచి తొలగించారని మండిపడ్డారు.
మణిపూర్‌లో రెండున్నర నెలలుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నా.. మహిళల నగ్న ఊరేగింపు వైరల్ కావడం.. దానిపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన వేళ.. పార్లమెంటు సమావేశాల మొదటి రోజు.. ఈ ఘటనపై ప్రధాని మోదీ తొలిసారి స్పందించారు. మణిపూర్‌లో జరిగిన ఘటన తీవ్ర బాధాకరమైందని పేర్కొన్న ప్రధాని.. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మణిపూర్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాల్లోని శాంతి భద్రలను పర్యవేక్షించాలని సూచించారు. మణిపూర్‌లో సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన జరిగితే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడి రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముందు డబులు ఇంజిన్ సర్కార్ ఉన్న మణిపూర్ సమస్యను పరిష్కరించాలని చురకలు అంటిస్తున్నారు.