ఆన్‌లైన్ క్లాసులు, ట్యాబ్స్ పంపిణీకి సంబంధించి బైజూస్‌తో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నలు సంధించారు. ఒప్పందం వివరాలను పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. నష్టాల్లో ఉన్న బైజూస్ కంపెనీతో కాంట్రాక్ట్ విషయంలో టెండర్లకు సంబంధించి ప్రభుత్వం స్టాండర్డ్ ప్రోటోకాల్ పాటించిందా? అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు ట్విట్టర్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు.
పవన్ అడిగిన ప్రశ్నలన్నింటికీ ఒక్కొక్కటిగా బొత్స సమాధానమిచ్చారు. టెండర్లకు సంబంధించి పరిధి లేదా అర్హతను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని తెలిపారు. రూ.100 కోట్లకుపైబడిన టెండర్లను ఖరారు చేసే విషయంలో హైకోర్టు నియమించిన ప్రత్యేక జడ్జి ఆధ్వర్యంలో ఫైనల్ చేస్తామని చెప్పారు. టెండర్ల స్పెసిఫికేషన్లను పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంచుతామని, స్పందించడానికి కంపెనీలకు 21 రోజుల పాటు గడువు ఇస్తామని బొత్స స్పష్టం చేశారు.
జడ్జి నిర్ణయం తీసుకున్న తర్వాత టెండర్ల స్పెసిఫికేషన్లు లాక్ చేయబడతాయని బొత్స చెప్పారు. టెండర్లను ఖరారు చేయడానికి న్యాయపరమైన ప్రివ్యూను కలిగి ఉన్న ఏకైక ప్రభుత్వం తమదేనని, ప్రపంచంలోనే ఎక్కడా ఇలా లేదని తెలిపారు. ఇది చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నానన్నారు. విద్యాశాఖ అత్యంత పారదర్శకమైన డిపార్ట్‌మెంట్ అని తాము గర్వంగా చెప్పుకుంటామని, దానికి నిదర్శనం మీరందరూ చూసిన ఫలితాలేనని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలను చూసి మీ టీచర్లు కూడా సిగ్గుపడతారని, వారికి తాను క్షమాపణలు చెబుతున్నట్లు బొత్స ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
టెండర్ల వివరాలు, ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల వివరాలను గూగుల్ సెర్చ్ చేసి తెలుసుకోవచ్చంటూ ఒక వెబ్‌సైట్‌ను బొత్స పోస్ట్ చేశారు. తాను పవన్ కల్యాణ్‌కు ట్యూషన్లు చెప్పడానికి సిద్దంగా ఉన్నానని, కానీ హోమ్‌వర్క్ చేస్తానంటూ ఆయన తనకు హామీ ఇవ్వాలన్నారు. ఈ రోజు అసైన్‌మెంట్ ఇదేనంటూ పవన్ కల్యాణ్ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ ఈ 7 ప్రశ్నలను బొత్స పోస్ట్ చేశారు. దీంతో ఈ ట్వీట్‌పై వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య సోషల్ వార్ నడుస్తోంది.