రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో అనేక చోట్ల వాగులు పొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు నియోజకవర్గంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో కట్లేరు, ఎదుళ్ల, పడమటి, గుర్రపు, విప్ల, కొండ వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. గంపలగూడెం మండలం వినగడప వద్ద వంతెనపై నుంచి కట్లేరు వాగు ప్రవహిస్తుండటంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే తిరువూరు - అక్కపాలెం రహదారిలో వంతెనపై నుంచి మూడు అడుగుల మేర ఎదుళ్ల వాగు వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు తిరువూరు - కోకిలంపాడు రహదారిపై అలుగు వాగు ప్రవహిస్తోంది.