తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం వివేకా హత్య కేసులో భాగంగా సీబీఐకి అవినాశ్ రెడ్డి రాసిన వంద పేజీల లేఖపై స్పందించారు. ‘‘వివేకా హత్య కేసుతో సంబంధం లేకపోతే కోర్టులో వాదనలు వినిపించుకోవాలిగాని సీబీఐకి లేఖలు రాయడం ఏమిటి! లాయర్లకు కోట్లు విరజిమ్మి వాదనలు వినిపించడం జగన్‌కు, అవినాశ్‌కు బాగా తెలిసిన విద్య. తనకూ, జగన్‌కు ఈ హత్యతో ఏ సంబంధం లేదని ప్రజలను మభ్యపెట్టడానికి అవినాశ్ లేఖల డ్రామా నడిపిస్తున్నాడు. ఆయనకు ధైర్యం ఉంటే మేం అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. హత్య జరిగిన రోజు అర్ధరాత్రి ఒకటిన్నర నుంచి తెల్లవారుఝాము ఐదుంబావు వరకూ వాట్సాప్ ద్వారా గంగిరెడ్డితో అవినాశ్‌రెడ్డి సంభాషణలు నడిచినట్లు సీబీఐ పేర్కొంది. వారిద్దరి ఫోన్ నంబర్లు కూడా తెలిపింది. గంగిరెడ్డితో సంభాషణ ముగిసిన తర్వాత అవినాశ్‌రెడ్డి, జగన్ సతీమణి భారతికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. తనకు అప్పగించిన పని పూర్తయిందని అనుకొన్న తర్వాతే అవినాశ్ ఈ విషయాన్ని జగన్‌కు, భారతికి చెప్పడం నిజం కాదా? అవినాశ్‌రెడ్డి కడప ఎంపీగా పోటీ చేయడానికి వీల్లేదని, నువ్వే పోటీ చేయాలని వివేకా ఒత్తిడి తెస్తే తాను ఒప్పుకొన్నానని షర్మిల చెప్పారు. ఇక అవినాశ్ కోసం వివేకా ప్రచారం చేసింది ఎక్కడ? వివేకా చురుగ్గా ఉంటే పులివెందులలో తమ ఆటలు సాగవనే అవినాశ్, జగన్ కలిసి ఆయనను తొలగించారన్నది స్పష్టం. ఉదయం 6.26 నిమిషాలకు తనకు వివేకా హత్య విషయం సమాచారం తెలిసిందని, వెంటనే 6.30కు వివేకా ఇంటికి చేరానని అవినాశ్‌రెడ్డి చెబుతున్నారు. జమ్మలమడుగు వెళ్తున్న అవినాశ్ సరిగ్గా నాలుగు నిమషాల్లో వివేకా ఇంటికి ఎలా చేరగలిగారు? వివేకా హత్య కేసులో రెండో నిందితునిగా ఉన్న సునీల్ యాదవ్... హత్యకు కొంత ముందు అనేక గంటలపాటు అవినాశ్‌రెడ్డి ఇంట్లోనే ఉన్నాడని గూగుల్ టేకౌట్ ద్వారా సీబీఐ నిరూపించింది. అవినాశ్ ఇంట్లో ఆయన ఎందుకు ఉండాల్సి వచ్చింది? రాజారెడ్డి ఆస్పత్రిలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్న ఉసిరెడ్డి శ్రీనివాసరెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం... ‘వివేకా ఇంటికి కాటన్, బ్యాండేజి తీసుకురావాలని అతనికి చెప్పారు. అతను తెచ్చిన కాటన్, బ్యాండేజి సరిపోదని మందలించి మరికొంత తేవాలని శివశంకర్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి కలిసి మళ్లీ ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రికి పంపారు’ అవినాశ్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి. భారతిరెడ్డి తండ్రి ఈసీ గంగిరెడ్డి. దీనికి అవినాశ్ సమాధానం ఏమిటి?’’ అని పట్టాభి ఇలదీశారు.