విశాఖపట్నం స్టీల్ ప్లాంటు అప్రంటిస్‌షిప్‌లకు ప్రకటన జారీచేసింది. గ్రాడ్యుయేట్ అప్రంటిస్ ట్రైనీ (జీఏటీ) ఖాళీలు 200, టెక్నీషియన్ అప్రంటిస్ ట్రైనీ (టీఏటీ) ఖాళీలు 50 ఉన్నాయని, ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. జీఏటీకి ఇంజనీరింగ్ పూర్తయినవారు, డిప్లమో చేసినవారు టీఏటీకి అర్హులు. వీరికి శిక్షణ కాలంలో నెలకు రూ.8 వేలు ఇస్తారు. ఏడాది మాత్రమే శిక్షణ ఉంటుంది. ఏడాది ముగిసిన తరువాత సర్టిఫికెట్ ఇచ్చి పంపేస్తారు. ఇది ఉద్యోగం కానే కాదు. భవిష్యత్తులో ఏమైనా పోస్టులు తీస్తే వాటికి అదనపు అర్హతగా ఈ సర్టిఫికెట్ ఉపయోగపడుతుందో లేదో కూడా స్పష్టంగా పేర్కొనలేదు. కానీ ఈ ప్రకటన రాగానే దళారులు రంగంలో దిగిపోయారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండానే స్టీల్‌ప్లాంటులో ఉద్యోగాలు వేయిస్తాం...అంటూ నమ్మబలుకుతున్నారు. ఒక్కో అభ్యర్థికి రూ.3 లక్షలు ఖర్చవుతుందని, తొలి ఏడాది శిక్షణ కాలంలో నెలకు రూ.8 వేలు ఇస్తారని, ఆ తరువాత పర్మనెంట్ చేస్తే నెలకు రూ.40 వేలు జీతం వస్తుందని ఆశ పెడుతున్నారు. దాంతో చాలా మంది దళారుల చేతిలో డబ్బులు పోస్తున్నారు.