కర్నూలు నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆంజనేయులు అనే వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్ళితే .... ఆంజనేయులు స్థానిక వాణిజ్యనగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. కింది ఫ్లోర్‌లో కోడుమూరు మార్కెట్ యార్డు సెక్రటరీ సుబ్బారెడ్డి అద్దెకు ఉంటున్నాడు. నాలుగు నెలల క్రితం సుబ్బారెడ్డికి చెందిన అకౌంటు, ఐఎఫ్ ఎస్‌పీ కోడు, ఏటీఎం కార్డు నెంబర్, పిన్ నెంబరు అన్నీ తీసుకున్నాడు. వీటిని అమేజాన్ అకౌంటుకు లింకప్ చేసుకున్నాడు. ఆ తర్వాత విడతల వారీగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో రూ.8.5లక్షల ద్వారా ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేశాడు. ఈ లావాదేవీల్లో సుబ్బారెడ్డి ఫోన్‌కు ఎలాంటి మెసేజ్ రాకుండా మేనేజ్ చేశాడు. ఆ తర్వాత గుర్తించిన సుబ్బారెడ్డి ఆంజనేయులును నిలదీశాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆంజనేయులు తన మకాంను హైదరాబాదుకు మార్చాడు. దీంతో బాధితుడు సుబ్బారెడ్డి నాలుగో పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. సుబ్బారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శంకరయ్య తెలిపారు.