దళితులకు సీఎం వైయస్ జగన్ పాలనపై ఎంతో నమ్మకం ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. చంద్రబాబు మాల, మాదిగల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడిన సమయంలో కేసులు పెట్టించాడు. ఎస్సీలపై కేసులు పెట్టించిన చంద్రబాబును ఎలా నమ్మాలి అంటూ మంత్రి సురేష్ దుయ్యబట్టారు. వర్గీకరణ కోసం పోరాటం చేసిన సమయంలో పెట్టిన కేసులను ఎత్తేయాలని సీఎంను కోరామని, మందకృష్ణ మాదిగతో పాటు మాదిగలందరి పైనా పెట్టిన కేసులు ఎత్తేయాలని వినతిపత్రం ఇచ్చామన్నారు. గరగపర్రు, లక్ష్మీపురం వంటి ఘటనల్లో ఎస్సీల పై పెట్టిన కేసులను ఎత్తేయాలని కోరామని, కేసులు మాఫీ చేసేందుకు సీఎం అంగీకరించారని మంత్రి తెలిపారు. అతి త్వరలోనే అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామన్నారు. అంబేద్కర్ విగ్రహంతో పాటు ఏర్పాటయ్యే స్మృతి వనంలో అనేక వసతులు కల్పిస్తున్నామని, 100 సీట్లతో ఏసీ థియేటర్, మ్యూజియం, లైబ్రరీ, నీటి కొలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.