కర్ణాటకలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. సిద్ధరామయ్య నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఐదు గ్యారెంటీ పథకాల హామీతో ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ.. ఓటర్లను తమవైపు ఆకర్షించుకుంది. దీంతో అధికారం చేపట్టిన తర్వాత సీఎం సిద్ధరామయ్య.. ఒక్కొక్క హామీని అమలు చేశారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనికోసం విదేశంలో పథకం రచిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై తమ ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారం ఉందని వెల్లడించారు.
అయితే ఈ కుట్ర చేసేది ఎవరో తమకు తెలుసు అని బీజేపీని ఉద్దేశించి పరోక్షంగా కర్ణాటక డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో ఇలాంటి ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తే తమ ప్రభుత్వానికి తెలుస్తుందని.. వేరే దేశంలో ఈ ప్రణాళికలు చేస్తున్నారని.. మీడియా అడిగిన ప్రశ్నలకు డీకే శివకుమార్ సమాధానమిచ్చారు. కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చేందుకు సింగపూర్‌లో కుట్ర జరుగుతోందని.. దానికి సంబంధించిన సమాచారం ఉందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేర్కొన్నారు. వైద్య పరీక్షల కోసం జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి సింగపూర్‌కు వెళ్లిన సమయంలోనే డీకే శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఇలాంటి కుట్రలకు కాంగ్రెస్ ప్రభుత్వం బెదరేది లేదని తేల్చి చెప్పారు.
కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి కుట్రలు జరుగుతున్నాయన్న డీకే శివకుమార్ వ్యాఖ్యలను కర్ణాటక రెవెన్యూ శాఖ మంత్రి కృష్ణ బైరెగౌడ కూడా సమర్థించారు. దేశంలో ఎన్నో ప్రభుత్వాలను కూలదోసిన చరిత్ర బీజేపీకి ఉందని విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే తమ ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రజల చేత రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడం అనేది బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని కృష్ణ బైరె గౌడ తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో చాలా రాష్ట్రాల్లో ఇలా ప్రభుత్వాలను పడగొట్టిన చరిత్ర బీజేపీది అని మండిపడ్డారు.