కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కర్ణాటకను కరువు వెంటాడుతుందని బీజేపీ చేస్తోన్న వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనకు ఎటువంటి మూఢ నమ్మకాలూ నాకు లేవని, అటువంటి గుడ్డి నమ్మకాలను తాను నమ్మబోనని అన్నారు. వాతావరణంలో మార్పులతోనే అతివృష్టి, అనావృష్టి సమస్య తీవ్రమవుతుందని సీఎం వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన హుబ్బళ్లి విమానాశ్రయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరవు వెంటాడుతుందంటూ బీజేపీ ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిందని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, దీనికి వారు ఏమి బదులిస్తారని సిద్ధరామయ్య ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు వరదల కారణంగా లక్ష ఇళ్లు కూలిపోయాయని, వారికి పరిహారాన్ని ఇవ్వడం కూడా సాధ్యపడలేదని ఎద్దేవా చేశారు. తీవ్ర వరదల సమయంలో బీజేపీ ఏం చేసిందని నిలదీశారు. వరదలు, కరువు కాటకాలు అనేవి ప్రకృతి విపత్తులని సిద్ధూ పేర్కొన్నారు.
వరద తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ఆయా జిల్లాల వ్యవహారాల మంత్రుల బృందం సందర్శిస్తున్నారని సీఎం తెలిపారు. తాను కూడా ఉడుపి, మంగళూరు, ఉత్తర కన్నడ జిల్లాల్లో పర్యటిస్తానని వెల్లడించారు. ‘వర్షాల కారణంగా హవేరీ ప్రాంతంలో రైతుల ప్రాణనష్టంపై సమీక్ష నిర్వహించాం.... భారీ వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో మంత్రుల నేతృత్వంలోని బృందాలు పర్యటించనున్నాయి’ అని సీఎం వివరించారు. కొడగు జిల్లాకు మంత్రి కృష్ణ భైరేగౌడ వెళ్లారని చెప్పారు.