టెర్రస్ మీద నిద్రపోతున్న 15 రోజుల పసికందును అడవి పిల్లి ఎత్తుకెళ్లి పై నుంచి విసిరి చంపేసింది. ఈ దారుణమైన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని బుదౌన్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. పశ్చిమ యూపీలో ఇటువంటి ఘటన ఈ నెలలో జరగడం ఇది రెండోసారి. బుదౌన్ జిల్లా ఉసావాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతరపట్టిలో భార్యాభర్తలు రేష్మ, మహ్మద్ హసన్ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. పెళ్లయిన ఆరేళ్ల తర్వాత ఈ దంపతులకు ఇటీవలే కవలలు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పుట్టారు.భర్త కూలి పనులకు వెళ్లిపోగా.. పిల్లలతో రెష్మా ఇంటి దగ్గరే ఉంది.
సోమవారం సాయంత్రం పిల్లలకు పాలిచ్చిన తర్వాత వారిని టెర్రస్‌పైకి తీసుకెళ్లి నిద్రపుచ్చింది. ‘కిందకు వచ్చి ఇంటి పనులు చేసుకుంటుండగా.. బాబు ఏడుపు వినిపించింది.. దీంతో పరుగెత్తుకుని వెళ్లి చూడగా.. ఓ నల్లరంగు అడవి పిల్ల బాబును నోట కరిచి తీసుకెళ్తోంది. దాని బారి నుంచి బాబును రక్షించడానికి ప్రయత్నించాను కానీ అప్పటికే పై నుంచి అది దూకేసింది. ఈ క్రమంలో బాబు కిందపడిపోయి బాధకు విలవిలలాడిపోయాడు.. వెంటనే వైద్యుడు దగ్గరకు తీసుకెళ్లాను.. కానీ, అప్పటికే చనిపోయాడు’ అని రెష్మా కన్నీటిపర్యంతమయ్యింది.
గత 15 రోజుల నుంచి ఆ పిల్లి తమ ఇంటి పరిసరాల్లో తిరుగుతోంది కానీ, ఎప్పుడూ మాకు సమీపంలోకి రాలేదని రేష్మా భర్త తెలిపారు. అయితే, ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే ఆ కుటుంబం అంత్యక్రియలు నిర్వహించినట్టు ఉసావాన్ స్టేషన్ ఆఫీసర్ రామేంద్ర సింగ్ అన్నారు. ఎటువంటి ఫిర్యాదు చేయలేదని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో ఏదైనా అడవి జంతువు కనిపిస్తే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. పది రోజుల కిందట ఆగ్రా జిల్లా పిండౌరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్వార్ జిల్లాలో నెలన్నర చిన్నారిని ఇలాగే ఓ అడవి పిల్లి పొట్టనబెట్టుకుంది.