టీడీపీ యువనేత నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రలో భాగంగా 166వ రోజైన బుధవారం సాయంత్రం ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.... ‘రాష్ట్రంలో పేదలకు అండగా నిలబడుతున్న టీడీపీకి, దోపిడీదారులున్న వైసీపీకి మధ్య యుద్ధం జరుగుతోంది. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంతి జగన్ పేదలకు, పెత్తందార్లకూ మధ్య యుద్ధం అంటున్నారు. ఆయన చెడ్డీలు వేసుకునే రోజుల్లోనే దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ’ అని స్పష్టం చేశారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, జనతా వస్ర్తాలు, పక్కాగృహాలు నిర్మించింది ఎన్టీ రామారావు అని గుర్తుచేశారు.