కడప ఉక్కు విషయంలో కేంద్రం వద్ద తీవ్ర అన్యాయం జరుగుతుంటే వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నారని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రవిశంకర్‌రెడ్డి ప్రశ్నించారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం సాధ్యం కాదని పార్లమెంటులో కేంద్ర సహాయమంత్రి ప్రకటించడాన్ని ఖండిస్తూ బుధవారం కడప నగరం ఐటీఐ సర్కిల్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... జగన్ అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి ఉక్కు పరిశ్రమ స్థాపిస్తామని గొప్పలు చెప్పి చేతులెత్తేశారన్నారు. సీమకు రావాలసిన విభజన చట్టంలోని హామీలను అమల్లోకి తెచ్చేవిధంగా రాష్ట్ర ఎంపీలు కేంద్రంపై వత్తిడి తేలేకపోయారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అన్ని పార్టీలతో కలిపి అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్రంపై పోరాటాలకు పిలుపునివ్వాలన్నారు.