టీడీపీ ఐదేళ్ల హయాంలో పెద్ద ప్రాజెక్టులు, చిన్న నీటి వనరులతో కలిపి సాగునీటి రంగానికి రూ.68వేల కోట్లు ఖర్చు చేశామని, వైసీపీ ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.22వేల కోట్లే ఖర్చు చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఇరిగేషన్ శాఖపై అయన మాట్లాడుతూ... ఐదేళ్లలో మేం బడ్జెట్‌లో ప్రాజెక్టులకు రూ.43వేల కోట్లు పెట్టి రూ.55 వేల కోట్లు ఖర్చుచేశాం. పెట్టినదాని కంటే ఎక్కువ ఖర్చుచేశాం. నీరు-చెట్టు కింద మరో రూ.13వేల కోట్లు వ్యయం చేశాం. జగన్ ప్రభుత్వం బడ్జెట్‌లో పెట్టినదానిలో సగం కూడా ఖర్చు చేయలేదు. మొదటి సంవత్సరం ప్రాజెక్టులకు బడ్జెట్‌లో రూ.13వేల కోట్లు పెట్టి రూ.4 వేల కోట్లు ఖర్చు చేశారు. మేం రాయలసీమను రతనాలసీమగా చేయాలని రాత్రింబవళ్లూ శ్రమించాం. పట్టిసీమ ప్రాజెక్టును వాయు వేగంతో పూర్తి చేసి కృష్ణా డెల్టాకు గోదావరి నీటిని ఇచ్చాం. కృష్ణా డెల్టాకు వెళ్లాల్సిన కృష్ణా జలాలను ఆదా చేసి 120 టీఎంసీలను రాయలసీమకు ఇచ్చాం. గండికోట రిజర్వాయర్ కింద భూ సేకరణ పూర్తి చేసి పనులు ముగించి పులివెందులలో బత్తాయి తోటలు ఎండిపోకుండా నీళ్లు ఇచ్చాం. కానీ కుప్పంకు వెళ్లాల్సిన కాల్వ పనులను జగన్ నిలిపివేసి తన కక్ష సాధింపును నిరూపించుకున్నాడు’ అని విమర్శించారు.