వివాహ వేడుకల్లో హిందీ సినిమా పాటల ప్రదర్శన కోసం కాపీరైట్ సొసైటీలు రాయల్టీ వసూలు చేయడంపై ఫిర్యాదులు రావడంతో కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్ 52 స్ఫూర్తికి విరుద్ధంగా వివాహ కార్యక్రమాలలో సినిమా పాటలను ప్రదర్శించి కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడ్డారని పేర్కొంటూ పలు సొసైటీలు రాయల్టీలను వసూలు చేయడంపై సాధారణ ప్రజలు, ఇతర భాగస్వాముల నుంచి డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్, ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ కి అనేక ఫిర్యాదులు అందాయని కేంద్రం తెలిపింది. కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 52 కాపీరైట్ ఉల్లంఘన కిందకు రాని కొన్ని చర్యలతో వ్యవహరిస్తుందని పేర్కొంది.
సెక్షన్ 52 (1) (za) ఇది ప్రత్యేకంగా సాహిత్య, నాటక, సంగీత లేదా ఏదైనా మతపరమైన వేడుక లేదా అధికారిక వేడుకలో సినిమా పాటలను ప్లే చేయడం కాపీరైట్ ఉల్లంఘన పరిధిలోకి రాదు అని స్పష్టతనిచ్చింది. మతపరమైన వేడుకలతో పాటు వివాహ ఊరేగింపు, ఇతర ఇతర సామాజిక ఉత్సవాలు ఇందులోకి వస్తాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని.. సెక్షన్ 52 (1) (za)కి విరుద్ధంగా ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా కాపీరైట్ సొసైటీలకు ఆదేశాలు ఇచ్చాం అని డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్, ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ తెలిపింది.
ఈ సెక్షన్ కింద ఏ వ్యక్తి, సంస్థ లేదా కాపీరైట్ సొసైటీ నుంచి ఎటువంటి డిమాండ్లను అంగీకరించవద్దని సాధారణ ప్రజలను సూచించింది. కాగా, ఈ నిర్ణయాన్ని సాధారణ ప్రజానీకం, హాస్పిటాలిటీ రంగం స్వాగతించింది. కాపీరైట్ చట్టం ప్రకారం ఒక రచనను మళ్లీ సృష్టించడానికి, దాన్ని ఇతర అవసరాలకు ఉపయోగించడానికి, అనువాదం చేయడానికి, వేరే అవసరాలకు వాడుకోవడానికి సంబంధించిన హక్కులన్నీ యజమానికి మాత్రమే ఉండేలా కాపీరైట్ రక్షణ కల్పిస్తుంది. దీని ద్వారా యజమానులు వారి కష్టార్జితం (ఒరిజినల్ వర్క్) దుర్వినియోగం కాకుండా కాపాడుకోవచ్చు. ఉల్లంఘన జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. వాటి ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని పొందే హక్కు యజమానికి మాత్రమే ఉంటుంది.
రచయిత లేదా యజమానికి కాపీరైట్ రక్షణను పరిమిత కాలానికి ఇస్తారు. సాధారణంగా వారు జీవించి ఉన్న రోజులకు అదనంగా 60 ఏళ్ల వరకు కాపీరైట్ ఉంటుంది. అంటే అసలు యజమానులు ప్రాణాలు కోల్పోయిన తరువాత, అదనంగా 60 సంవత్సరాల వరకు మాత్రమే కాపీరైట్ అమల్లో ఉంటుంది. అప్పటి వరకు పూర్తి హక్కులను దాని యజమానుల వారసులు పొందవచ్చు.