వరద ఉద్ధృతికి ఢిల్లీ నగరం సహా పరిసర ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకుపోయాయి. ఈ క్రమంలోనే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. అయితే వారికి నది ఒడ్డున ఒక డాల్ఫిన్ దొరికింది. దాన్ని వారు ఇంటికి తెచ్చుకున్నారు. అనంతరం దాన్ని కోసి వండుకుని తిన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై కేసు కూడా నమోదు చేసిన పోలీసులు.. ఒకరిని అరెస్ట్ చేశారు.
జులై 22 వ తేదీన కొంతమంది మత్స్యకారులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని నసీర్‌పూర్ గ్రామంలో ఉన్న యమునా నదిలోకి చేపల వేటకు వెళ్లారు. వారు వేసిన వలలో ఒక డాల్ఫిన్ చిక్కుకుంది. దాన్ని ఒడ్డుకు లాగిన మత్స్యకారులు.. దాన్ని ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఆ డాల్ఫిన్‌ను ఓ వ్యక్తి భుజంపై మోసుకెళ్తున్న దృశ్యాలను అక్కడ ఉన్న వారు వీడియో తీశారు. ఆ మత్య్సకారులు దాన్ని ఇంటికి తీసుకెళ్లి వండుకున్నారు. అనంతరం దాన్ని తిన్నారు. అయితే ఆ మత్స్యకారులు డాల్ఫిన్‌ను తీసుకెళ్తున్న వీడియోలను సోషల్ మీడియాలో ఉంచడంతో అది వైరల్‌గా మారింది.
దీంతో పోలీసులకు ఈ వీడియో చేరడంతో వారు కూడా రంగంలోకి దిగారు. జూలై 22 వ తేదీన అటవీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నలుగురు మత్స్యకారులపై కేసులు నమోదు చేశారు. అందులో ఒకరిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద నిందితులు రంజీత్ కుమార్, సంజయ్, దీవన్, బాబాలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటి కొన్ని వన్య ప్రాణులను చంపడం.. వాటిని తినడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా స్థానికంగా ఉన్న మత్స్యకారులకు సూచనలు చేశారు. ఇలా వన్యప్రాణులను హింసించడం, చంపడం వంటివి చేస్తే కఠిన శిక్షలు పడతాయని వెల్లడించారు.