ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరుగైన అవకాశాలు లభించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లోని నిరుపేద విద్యార్థులు కూడా విదేశాలలోని యూనివర్సిటీలలో చదువుకునే గొప్ప అవకాశం కల్పించేందుకే విదేశీ విద్యాదీవెన పథకం తీసుకొచ్చినట్లు సీఎం పేర్కొన్నారు. ప్రతిభ, నైపుణ్యం ఉన్న మన విద్యార్థులకు మనమే అండగా ఉండాలనే సంకల్పంతో ఆర్థిక సాయం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరుగైన అవకాశాలు లభించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. ఈమేరకు గురువారం ఉదయం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు. విదేశీ విద్యా దీవెన పథకం నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు.
విదేశీ విద్యాదీవెన పథకంతో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ముఖ్యమంత్రి జగన్ వివరించారు. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం కానీ, విద్యా వ్యవస్థలో మార్పులు కానీ లేవన్నారు. లంచాలకు, వివక్షకు చోటివ్వకుండా ప్రతిభావంతులైన విద్యార్థులకు నిధులు అందిస్తున్నట్లు తెలిపారు. బిడ్డల విదేశీ విద్య కోసం తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే పరిస్థితి రాష్ట్రంలో ఉండకూదని చెప్పుకొచ్చారు. అప్లికేషన్ పెట్టుకున్న విద్యార్థుల అర్హతను బట్టి ప్రభుత్వం అండగా ఉంటోందని, విదేశాలలో చదువు పూర్తిచేసుకున్న మన బిడ్డలకు ప్రపంచ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని చెప్పారు.
గత ప్రభుత్వం విదేశీ విద్యార్థులకు నామమాత్రంగా ఆర్థిక సాయం అందించేదని జగన్ మండిపడ్డారు. కేవలం రూ.10 లక్షలు ఇచ్చి అదే గొప్ప సాయమన్నట్లు చెప్పుకున్నారని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలలో ఉన్నత చదువులకు దాదాపు రూ.కోటి వరకు ఖర్చవుతోందని, అందులో ఈ పది లక్షలు దేనికి సరిపోతాయని ప్రశ్నించారు. అందుకే తమ ప్రభుత్వం రూ. 1.25 కోట్లు అందజేస్తోందని చెప్పారు. ఫ్లైట్ చార్జీల నుంచి అన్ని ఖర్చులకూ విద్యార్థులను ఆదుకుంటోందని తెలిపారు. గడిచిన ఆరు నెలల్లో విదేశీ విద్యాదీవెన పథకం కింద రూ.65.48 కోట్ల ఆర్థిక సాయం అందించామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.