సాధారణంగా దేవుడి విగ్రహాలను గుడిలో ఉంచి.. పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మాత్రం దేవుడి విగ్రహాల స్థానంలో కుక్కలు ఉంటాయి. అదేంటి అనుకుంటున్నారా. అవును నిజం. ఆ గుడిలో కుక్కలనే పూజిస్తారు. వాటి కోసం గుడి కట్టించి నిత్యం పూజలు చేస్తున్నారు. ఆ గ్రామంలో దేవతల కంటే ముందే ఈ శునకాలకు పూజలు చేస్తున్నారు. ఆ ఆలయంలో ఏటా పండగ కూడా నిర్వహిస్తున్నారు. స్థానికులు సైతం ఆ గుడిలోకి వెళ్లి.. పూజలు చేసేందుకు ఎగబడిపోతున్నారు. ఈ గుడిలో మరో విశేషం కూడా ఉంది. ఇక్కడ పూజ చేసి కోరికలు కోరుకుంటే తప్పక నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు తరలి వస్తున్నారు. ఈ గుడి కర్ణాటకలో ఉంది.
కర్ణాటకలోని రామనగర జిల్లాలోని చన్నపట్న పట్టణం అగ్రహార వలగెరెహళ్లి అనే చిన్న గ్రామంలో ఈ శునక దేవాలయం ఉంది. కొన్ని ఏళ్ల కిందట ఆ ఊరి ప్రధాన దేవత కెంపమ్మ ఆలయాన్ని నిర్మించారు. ఆ గుడి నిర్మించిన కొన్ని నెలలకే ఆ గ్రామంలోని రెండు కుక్కలు కనిపించకుండా పోయాయి. ఇలా కుక్కలు అదృశ్యమైన తర్వాత కొన్ని రోజులకు.. ఆ ఊరిలోని ఓ వ్యాపారి కలలోకి గ్రామ దేవత వచ్చింది. గ్రామస్థులను రక్షించేందుకు.. కనిపించకుండా పోయిన రెండు కుక్కలకు తన ఆలయానికి సమీపంలో మరో గుడిని నిర్మించాలని కోరింది. దీంతో ఆ గ్రామస్థులంతా చర్చించుకుని ఆ రెండు కుక్కలకు ఆలయం నిర్మించారు. అందులో రెండు శునకాల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు.
అప్పటి నుంచి నిత్యం ఆ శునకాల ఆలయంలో పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ ఊరి గ్రామ దేవత గుడిలో కంటే ముందే ఈ శునకాలకు పూజలు చేస్తారు. అంతేకాకుండా ప్రతి ఏడాది పండగ కూడా చేస్తున్నట్లు గ్రామస్థులు వెల్లడించారు. దీంతో ఈ ఊరి పేరు, శునకాల ఆలయం పేరు.. బాగా ఫేమస్ అయింది. దీంతో అక్కడికి స్థానిక గ్రామాల ప్రజలే కాకుండా కర్ణాటక వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు రావడం ప్రారంభించారు. అయితే ఈ శునకాల ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది. ఈ గుడిలో మొక్కులు మొక్కుకుంటే కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తులు నమ్ముతున్నారు. అందుకే ఈ గుడికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు తరలి వస్తున్నారు. అయితే కొంతమంది ఈ గుడిని చూసిన వారు కుక్కలకు గుడి ఏంటి.. పైగా గ్రామ దేవతల కంటే ముందే పూజలు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు.