లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. కటిక పేదరికంలో ఉన్న వారు రాత్రికి రాత్రే కోటీశ్వరులైన సంఘటనలు మనం ఎన్నో చూశాం. అదే ఆ మహిళల విషయంలో నిజమైంది. రెక్కాడితే డొక్కాడని ఆ మహిళల కుటుంబ సభ్యుల్లో ఒక్క రాత్రే కోట్లు వచ్చిపడ్డాయి. ఎలా అంటే వారు కొన్న లక్కీ లాటరీ.. జాక్‌పాట్ కొట్టింది. రూ. 250 పెట్టి కొన్న ఆ లాటరీ టికెట్.. ఏకంగా రూ.10 కోట్లు గెలుచుకుంది. అయితే టికెట్ కొనేందుకు ఈ రూ. 250 కూడా వారి దగ్గర లేకపోవడంతో తలా ఇంత పోగు చేశారు. చివరికి ఆ లాటరీలో వాళ్లు గెలవడంతో వారి పేదరికం పోయి.. ఒకేసారి కోటీశ్వరులుగా మారారు.
కేరళలోని మలప్పురం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పరప్పణగాడి మున్సిపాలిటీలో హరిత కర్మ సేన అనే విభాగం ఉంది. ఈ హరిత కర్మసేన విభాగంలో పనిచేసేవారు.. ఇళ్లు, ఆఫీసుల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ యూనిట్లకు తరలిస్తారు. అయితే ఈ హరిత కర్మ సేనలో పనిచేస్తున్న 11 మంది మహిళలు కొన్ని రోజుల క్రితం లాటరీ టికెట్ కొనాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ లాటరీ టికెట్ ధర రూ. 250 ఉండగా.. వారి వద్ద అంత సొమ్ము లేకుండా పోయింది. దీంతో తమ వద్ద ఉన్న డబ్బులు అన్నీ ఒక దగ్గర పోగేశారు. అందులో 9 మంది మహిళల వద్ద రూ. 25 ఉన్నాయి. మరో ఇద్దరు మహిళల వద్ద రూ. 12.50 ఉన్నాయి. దీంతో మొత్తం కలిసి చివరకు రూ. 250 పోగు చేసి.. లాటరీ టికెట్ కొన్నారు.
అయితే గత బుధవారం కేరళ లాటరీ డిపార్ట్‌మెంట్ డ్రా తీసింది. అయితే ఆ మహిళలు కొన్న లాటరీ టికెట్‌కే జాక్‌పాట్ తగిలింది. ఈ లాటరీ ప్రైజ్ మనీ రూ.10 కోట్లు కావడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయింది. తమ కష్టాలన్నీ పోయాయని.. ఇక నుంచి సంతోషంగా బతకవచ్చని ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఈ లాటరీ టికెట్ కంటే ముందు చాలా లాటరీ టికెట్లు కొన్నామని.. అయినా ఎప్పుడూ తమకు అదృష్టం వరించలేదని మహిళలు వెల్లడించారు. ఈ సారి డబ్బులు లేకపోయినా.. అందరి వద్దా పోగేసి లాటరీ టికెట్ కొనగా.. ఇప్పుడు జాక్‌పాట్ తగిలిందని చెప్పారు. ఈ జాక్‌పాట్‌తో తమతోపాటు తమ కుటుంబాలు కూడా సంతోషంగా ఉన్నాయని పేర్కొన్నారు. తమకు వచ్చే కొంచెం జీతంతో కుటుంబాలను నడపడం రోజురోజుకూ తీవ్ర భారంగా మారుతోందని తెలిపారు. ఆడపిల్లల పెళ్లిళ్లు, చేసిన అప్పులు, వైద్య చికిత్సల వంటి ఎన్నో సమస్యలు తమను వేధిస్తున్నాయని వెల్లడించారు. ఈ లాటరీలో గెలుచుకున్న డబ్బుతో తమ సమస్యలు తీరుతాయని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.