మా ఇల్లు ఎమ్మెల్యే ఇంటి పక్కనే. మా ఇల్లు మంత్రి ఇంటి ముందే. మా ఇల్లు ఎంపీ గారి ఇంటి వెనకాలే. ఇలా చాలా మంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అదేదో వీళ్లేదో గొప్ప సాధించిన వారిలా చెబుతారు. అయితే అలాంటి వారు ఇంటి వద్ద మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రులు అంటే.. కార్యకర్తలు, పార్టీ నేతలు, ప్రజలతో ఎప్పుడూ సందడిగా ఉంటుంది. వారి ఇళ్ల ముందు కార్లు క్యూలో ఉంటాయి. ఇది సాధారణంగా అక్కడ ఉన్న వారికి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అలా జరిగినా.. ఏం అనకుండా వారి పని వారే చూసుకుంటూ ఉంటారు. అయితే అందరిలా కాకుండా సీఎం ఇంటి ముందు నివసించే ఓ వ్యక్తి ఏకంగా తనకు కలుగుతున్న ఇబ్బందిని ముఖ్యమంత్రిని అడ్డుకున్నాడు. ఇది కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంటి వద్ద జరిగింది.
బెంగళూరులో సీఎం సిద్ధరామయ్య నివసించే ఇంటికి ఎదురుగా నరోత్తమ్ అనే వృద్ధుడు ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్నాడు. శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్తున్న సీఎం సిద్ధరామయ్య కాన్వాయ్‌ని నరోత్తమ్ ఆపేశాడు. దీంతో వెంటనే ముఖ్యమంత్రి సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. అతన్ని ఆపేశారు. తాను సీఎంతో మాట్లాడాలని కోరడంతో.. చివరకు అధికారులు అనుమతించారు. అనంతరం సిద్ధరామయ్య వద్దకు వెళ్లిన నరోత్తమ్ తాను ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించాడు. ముఖ్యమంత్రిగా తమరిని చూసేందుకు వచ్చే వారు కార్లు, వాహనాలు ఇష్టం వచ్చినట్లు పార్కింగ్ చేయడంతో తనకు అసౌకర్యంగా ఉందని వాపోయాడు. తమ కార్లను ఇంటి నుంచి బయటికి తీయలేకపోతున్నామని.. బయటి నుంచి ఇంట్లో పార్కింగ్ చేయలేకపోతున్నామని.. కారు పార్కింగ్ చేసుకునేందుకు కూడా స్థలం ఉండడం లేదని గోడు వెళ్లబోసుకున్నాడు. ఐదేళ్ల నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. ఇక భరించలేకపోతున్నామని చెప్పడంతో.. సీఎం స్పందించారు. పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను సిద్ధరామయ్య ఆదేశించారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన సిద్ధరామయ్య.. కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సీఎం అధికారిక నివాసానికి మారలేదు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు ఉన్న ఇంట్లోనే ప్రస్తుతం సిద్ధరామయ్య ఉంటున్నారు. సీఎం అధికారిక బంగ్లాను కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప ఖాళీ చేయకపోవడంతో.. సిద్ధరామయ్య ప్రస్తుతం తన పాత ఇంట్లోనే నివసిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే యడియూరప్ప త్వరలోనే అధికారిక బంగ్లాను ఖాళీ చేస్తారని.. ఆగస్టు నెలలో సిద్ధరామయ్య అందులోకి మారే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.