ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దాదాపు 3 నెలలుగా మణిపూర్‌లో అల్లర్లు, హింసాత్మక సంఘటనలు జరుగుతున్నా.. ఇటీవల ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. అందులో ఒక మహిళపై గ్యాంగ్‌రేప్ జరిగిన వీడియో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వరుసగా వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఇక సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసుకుని విచారణకు ఆదేశించింది. బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది.
ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే మహిళల నగ్న ఊరేగింపు వీడియోను విడుదల చేశారని.. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన కుట్రను తేల్చాల్సి ఉందన్నారు. మణిపూర్ హింసాత్మక ఘటనలు.. మహిళల నగ్న ఊరేగింపుపై సుప్రీంకోర్టుకు కేంద్ర హోంశాఖ నివేదించిన అఫిడవిట్‌లోని అంశాలను అమిత్ షా మీడియాకు తెలిపారు.
1990 నుంచి మణిపూర్‌లో కుకీ, మెయితీ తెగల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని వెల్లడించారు. కేంద్రంలో, మణిపూర్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. చాలా ఘటనలు జరిగాయని అమిత్ షా గుర్తు చేశారు. 1993 లో నాగా - కుకీలకు.. 1993 మే నెలలో మెయితీ - పంగల్ తెగల మధ్య, 1995 లో కుకీలు - తమిళుల మధ్య, 1997 నుంచి 1998 మధ్య కుకీ - మెయితీల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు.
తాజాగా మణిపూర్‌లో జరిగిన హింసాత్మక ఘటనలు.. మే 4 వ తేదీన కుకీ మహిళలపై జరిగిన అత్యంత అమానవీయ ఘటనపైనా అమిత్ షా స్పందించారు. ఈ ఘటనపై ఇప్పటికే ఓ మైనర్ సహా ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీడియో తీసిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశామని.. వీడియో తీసిన మొబైల్ ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే ఈ వీడియో విడుదల చేశారని.. దీని వెనక కుట్ర ఉందని ఆరోపించారు. ఈ కుట్రను తేల్చేందుకే దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. మణిపూర్ ఉద్రిక్తతలను మరింత రెచ్చగొట్టేందుకు 2022లో మయన్మార్‌లో జరిగిన సంఘటనలకు సంబంధించిన 2 వీడియోలను వైరల్ చేస్తున్నారన్నారు. దీనిపై మణిపూర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారని వెల్లడించారు.
మణిపూర్ అల్లర్లకు సంబంధించిన కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి బదిలీ చేసింది. ఇప్పటికే 6 కేసులను ఇప్పటికే సీబీఐకి పంపినట్లు వెల్లడించారు. మరో 3 కేసులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా కొనసాగుతోందని హామీ ఇస్తున్నామని చెప్పారు. మణిపూర్ ఘటనపై కేసు విచారణను పొరుగు రాష్ట్రమైన అస్సాంలో విచారణ జరపాలని సుప్రీంకోర్టును కోరుతున్నట్లు విజ్ఞప్తి చేశారు. మణిపూర్ నగ్న మహిళల ఊరేగింపు సమయంలో.. అక్కడ పోలీసులు గానీ, ఆర్మీగానీ లేదని పోలీసులు స్పష్టం చేశారు. నిఘా సంస్థలు, హోం శాఖకు గానీ.. వీడియోకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్పారు.
మరోవైపు.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 6,065 ఎఫ్‌ఐఆర్‌లు మణిపూర్‌లు నమోదు చేశారని తెలిపారు. మణిపూర్ ఘటనపై కేంద్రం జోక్యం చేసుకున్న తర్వాత మణిపూర్ పరిస్థితి కొంత అదుపులోకి వచ్చిందని పేర్కొన్నారు. జులై 18వ తేదీ నుంచి మణిపూర్‌లో ఎవరూ చనిపోలేదని అమిత్ షా స్పష్టం చేశారు. మే 3వ తేదీ నుంచి జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటివరకు 147 మంది చనిపోగా.. 40 వేల మందిని ప్రభుత్వ సహాయక శిబిరాలకు తరలించినట్లు చెప్పారు. ప్రస్తుతం మణిపూర్‌లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని.. 72 శాతం ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి చేరినట్లు తెలిపారు. 82 శాతం మంది విద్యార్థులు పాఠశాలలకు చేరుకున్నట్లు వెల్లడించారు. త్వరలోనే మణిపూర్‌లో శాంతి భద్రతలు సాధారణ స్థితికి వస్తాయని అమిత్ షా తెలిపారు.