‘‘పెన్నా టు వంశధార’’ పేరుతో చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమం చేపట్టనున్నట్లు టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు 1 నుంచి పది రోజుల పాటు చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన చేపడతారని అన్నారు. కొన్ని ప్రాజెక్టులను ప్రీక్లోజర్ చేసేసిన విధానాన్ని ప్రజలకు చంద్రబాబు వివరిస్తారని చెప్పారు. చంద్రబాబు చేపట్టే పెన్నా టు వంశధార కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా చూడొద్దని.. ప్రజా అవగాహన కార్యక్రమంగా చూడాలన్నారు. జగన్ సహా మంత్రులు.. వైసీపీ నేతలు దోపిడీనే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. వ్యవసాయ, సాగునీటి రంగాలను జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. అన్నపూర్ణగా పేరొందిన ఏపీలో వ్యవసాయం, సాగునీటి రంగాలను జగన్ భ్రష్టు పట్టించారన్నారు. ప్రభుత్వాన్ని తాము ప్రశ్నిస్తే ఎదురు దాడి చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు బీజం పడిందని.. దాన్ని చంద్రబాబు కంటిన్యూ చేస్తున్నారని తెలిపారు. ఇరిగేషన్ రంగాన్ని ప్రభుత్వం ఎలా గాలికొదిలేసిందో చంద్రబాబు ఇప్పటికే వివరించారన్నారు. మరోసారి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా ప్రజల్లో అవగాహన కలిగిస్తారన్నారు. 2014-19 మధ్య కాలం ఇరిగేషనుకు స్వర్ణ యుగమన్నారు. జగన్ చెప్పేవన్నీ అబద్దాలే అంటూ మండిపడ్డారు. ఇంకేం ఖర్చు పెడతారు..? వర్షా కాలంలో ప్కాజెక్టులకు ఖర్చు పెట్టడం సాధ్యమా.. అని ప్రశ్నించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు టీడీపీ హయాంలోనే ఎక్కువ ఖర్చు పెట్టారని జగనుకు అత్యంత ఆప్తుడైన ఈఎన్సీనే చెప్పారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.