ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్సార్‌సీపీని,,,కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ చేస్తుంది,,,,రఘురామకృష్ణ రాజు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 29, 2023, 06:23 PM

ఏపీలో జరిగే వచ్చే ఎన్నికల్లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలపై సర్వే అంటూ ఓ రిపోర్టును తెరపైకి తీసుకొచ్చారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. తాను రాష్ట్రంలో వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేలను క్రోడీకరించి వచ్చిన వాస్తవాలను ఆధారంగా, కొన్ని సర్వే ఏజెన్సీలతో మాట్లాడినట్లు చెప్పారు. చివరగా తాను ఒక అంచనాకు వచ్చానని.. రాష్ట్రంలో ప్రస్తుతం ఓటర్ నాడీ ఎలా ఉందో ప్రజలకు వివరించే ప్రయత్నాన్ని చేస్తున్నట్లుగా వివరించారు. తమ పార్టీ అత్యంత దారుణంగా ఓటమి ఖాయమన్నారు.


లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీకి మూడు నుంచి నాలుగు స్థానాలు, అసెంబ్లీ ఎన్నికల్లో 20 నుంచి 25 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీకి మూడు నుంచి నాలుగు స్థానాలకు మించి గెలిచే అవకాశాలు కనిపించడం లేదన్నారు. 2009లో అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీ.. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు అంతా తమ పార్టీకి బదిలీ అయిందని.. ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు, కొన్ని చోట్ల నోటాకు పోలైన ఓట్ల కంటే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులకు తక్కువగానే ఓట్లు వచ్చాయన్నారు.


తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు జట్టు కట్టి 2014 ఎన్నికల్లో విజయం సాధించాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ముస్లిం మైనారిటీ ఓటర్లు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని చూసి ఆయన తనయుడి నాయకత్వంలో ఉన్న వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారని తేలిందన్నారు. గత ఎన్నికల్లోను ముస్లిం మైనారిటీ ఓటర్లు తమ పార్టీకి మద్దతుగా నిలిచారని.. అయితే తన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల తర్వాత.. రానున్న ఎన్నికల్లో తమ ఓట్లను కాంగ్రెస్ పార్టీకి వేయాలని ఒక నిర్ణయానికి వచ్చానన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేసిన ముస్లిం మైనారిటీలు.. ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ఖాయంగా కనిపిస్తోందన్నారు.


రాయలసీమతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంకు 6% ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నది ఒక అంచనాగా వివరించారు. కారణాలేమైనా తన ప్రస్తుత పార్టీకి ముస్లిం మైనార్టీలు సింహభాగం దూరం కావడం ఖాయమన్నారు. వారంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని.. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు దక్కకపోయినప్పటికీ తమ పార్టీ మాత్రం చాలా స్థానాలలో నష్టపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. లోక్ సభ ఎన్నికల్లో అరకు, రాజంపేట, కడప స్థానాలలో కూడా మెజారిటీ తగ్గినా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. ప్రస్తుతం అధికార పార్టీకి మెజారిటీ తగ్గిపోయి ఈ స్థానాలలో ప్రతిపక్షాలతో నువ్వా నేనా అన్నట్లు తలపడాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు.


ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతనే కనిపిస్తున్నట్లు స్పష్టం అవుతోందన్నారు. ఇప్పటి వరకు తమ పార్టీకి సాలీడు ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీ, ఎస్టీలలో కూడా కొంత వ్యతిరేకత కనిపిస్తోందన్నారు.. వారు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు షిఫ్ట్ అయ్యే అవకాశాలు లేకపోలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల స్వీకరిస్తే.. ప్రజలపై ఆమె ప్రభావం బలంగా ఉండనుందన్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ అధికార పార్టీ మరిన్ని తక్కువ స్థానాలకు పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతానికి అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 40 నుంచి 45 స్థానాలు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీల మధ్య పొత్తు అధికారికంగా ఖరారైతే.. ప్రజల్లో నెలకొన్న భయం తగ్గితే ఆ సంఖ్య 20 నుంచి 25 స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉన్నట్లుగా ట్రెండ్ కనిపిస్తోందని అన్నారు.


ముందస్తు అసెంబ్లీ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలనే చేసినప్పటికీ విఫలమయ్యారన్నారు. కేంద్రం ఈ ప్రతిపాదనకు ఒప్పుకోలేదని తెలిసిన తర్వాతే నిర్ణీత సమయంలోనే ఎన్నికలకు వెళ్తామని పేర్కొన్నట్లు స్పష్టమవుతుందన్నారు. అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికలు కూడా కలిసి వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిగత ఇమేజ్ తీవ్రంగా ప్రభావం చూపనుందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష కూటమి ఏర్పాటుకు మరికొంత సమయం పట్గొచ్చని.. పవన్ కళ్యాణ్ చెబుతున్నట్లుగా, ఎంతో మంది ప్రజలు ఆశిస్తున్నట్లుగా, ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీల మధ్య భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ, పొత్తు మాత్రం ఖాయంగానే కనిపిస్తోందన్నారు. ఎన్నికలు సజావుగా జరగాలంటే ప్రజల్లో మనోధైర్యం రావలసిన అవసరం ఉందన్నారు. అధికారికంగా పొత్తు ప్రకటించిన తర్వాత పరిస్థితిలో కొంత మార్పు రావచ్చునని.. ప్రతిపక్షాల ఓట్లు చీలే అవకాశాలు కనిపించడం లేదన్నారు. ప్రజా జీవితంలో ఓటర్లను మించిన తెలివైన వారు ఎవరూ లేరని.. రానున్న ఎన్నికల్లో ధన ప్రభావం కేవలం ఒకటి నుంచి రెండు శాతం మాత్రమే ఉంటుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com