ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనకాపల్లిలో పొలాల్లోకి వచ్చిన కింగ్ కోబ్రా,,,రెస్క్యూ టీమ్ పట్టుకోబోతే బీభత్సం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 29, 2023, 06:33 PM

అనకాపల్లి జిల్లాలో ఓ భారీ కింగ్ కోబ్రా అలజడి సృష్టించింది. చీడికాడ మండలం తురువోలు శివారులోని పొలాల్లో కొంత మంది వ్యవసాయ కూలీలు పనులు చేస్తుండగా.. అటుగా ఓ భారీ కింగ్ కోబ్రా వచ్చింది. ఆ భారీ సర్పాన్ని చూసి వారు భయంతో దూరంగా పరుగులు తీశారు. అటవీ శాఖ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకొని ఆ కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు ప్రయత్నించిన రెస్క్యూ సిబ్బందిన ఆ పాము ముప్పుతిప్పలు పెట్టింది. ఇంతెత్తున లేస్తూ వారి మీదికి బుసలు కొట్టింది. కింగ్ కోబ్రాను బంధించే క్రమంలో వారు పలుమార్లు తృటిలో పాము కాటు నుంచి తప్పించుకున్నారు.


ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. రెస్క్యూ సిబ్బందిలో ఒకరు ఆ పామును బంధించే క్రమంలో తోకను పట్టుకొని బురదలో పడిపోయారు. అదే సమయంలో అది వెనక్కి తిరిగి బుసకొట్టింది. వెంటనే తేరుకొని ఆయన దాని తోకను పట్టుకొని వెనక్కి విసరగా.. ఆ వెనుక ఉన్న మరో వ్యక్తి తృటిలో దాని బారి నుంచి తప్పించుకున్నాడు. ఆ దృశ్యాలను చూస్తుంటేనే వణుకు పుడుతోంది. మొత్తానికి తీవ్రంగా శ్రమించిన రెస్క్యూ టీమ్.. ఆ భారీ కింగ్ కోబ్రాను బంధించి, సంచిలో వేశారు. ఆ పామును అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని అధికారి శివకుమార్ తెలిపారు. ఆ సర్పం 13 అడుగుల పొడవు ఉందని ఆయన తెలిపారు.


పాములను దూరం నుంచి చూస్తేనే వణుకు పుడుతుంది. అలాంటిది వాటిని బంధించడం అంత తేలికైన వ్యవహారం ఏమీకాదు. అందులోనూ కింగ్ కోబ్రాను బంధించడం మరింత కష్టం. అన్ని పాముల మాదిరిగా కింగ్ కోబ్రాను బంధిస్తామంటే కుదరదు. అందుకోసం ప్రత్యేక శిక్షణ అవసరం. ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాస్వాన్ గతంలో ఓ వీడియోను పోస్టు చేసి.. కింగ్ కోబ్రాను ఎలా బంధించకూడదో తెలిపారు. కర్ణాటకలో చోటు చేసుకున్న ఆ ఘటనలో భారీ కింగ్ కోబ్రా బారి నుంచి ఓ స్నేక్ రెస్క్యూయర్.. కాస్తలో బయటపడ్డాడు. అప్పట్లో ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. బాత్రూమ్‌లో దూరిన కింగ్ కోబ్రా తోకను పట్టుకొని లాగేందుకు ప్రయత్నించగా.. క్షణంలో అది వెనక్కి తిరిగి బుసలుకొట్టింది. అతడికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనయ్యింది.


‘పామును ఎలా రెస్క్యూ చేయకూడదో తెలిపే ఘటన ఇది. ముఖ్యంగా కింగ్ కోబ్రా విషయంలో..’ అని పర్వీన్ కాస్వాన్ ట్వీట్ చేశారు. ఈ ఘటన 2021 ఆగస్టు 26న చోటు చేసుకుంది. కర్ణాటకలోని బెల్తాంగడీలో ఓ ఇంట్లో ఈ భారీ సర్పం కనిపించింది. బాత్రూమ్‌లోకి దూరిన కింగ్ కోబ్రాను చూసి ఆ కుటుంబం భయాందోళనకు గురైంది. స్నేక్ క్యాచర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు.


స్నేక్ క్యాచర్ అక్కడికి వచ్చి ఆ పామును బంధించే ప్రయత్నం చేశాడు. ఆయన అక్కడికి వచ్చేటప్పటికి బాత్రూమ్ బయట తోక భాగం మాత్రమే కనిపించింది. ఆ తోకను పట్టుకొని బయటకు లాగే ప్రయత్నం చేశాడు. తోక పట్టుకొని లాగే లోపే ఆ భారీ సర్పం ఒక్కసారిగా వెనక్కి తిరిగి నిల్చుంది. క్షణాల వ్యవధిలో ఆయన దాని తోకను విడిచిపెట్టి పక్కకు తప్పుకున్నాడు. లేకపోతే కాటు వేసేదే! మొత్తానికి ఆ షాక్ నుంచి తేరుకున్న ఆ స్నేక్ క్యాచర్.. కాసేపటి తర్వాత ఆ పామును బంధించి అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలేశారు. అయితే.. అదంత తేలికేం కాలేదు. ఆ భారీ సర్పం ఆయణ్ని ముప్పుతిప్పలు పెట్టింది.


‘వన్యప్రాణులతో ఎన్‌కౌంటర్ మనకే ప్రమాదం..’, ‘ఆ స్నేక్ క్యాచర్‌కు ఇది నిజంగా పునర్జన్మే..’, ‘ఆ పామును చూస్తుంటేనే నాకు వణుకు పుడుతోంది. నా జీవితంలో ఇలాంటి ఘటన చూడలేదు’ అంటూ నెటిజన్లు నాటి వీడియో గురించి కామెంట్లు పెట్టారు. అందువల్ల ఎంతటి తలపండితులైన స్నేక్ క్యాచర్లైనా.. కింగ్ కోబ్రాను బంధించాల్సి వస్తే, మరింత అప్రమత్తంగా ఉండాల్సిందేనని ఈ రెండు ఘటనలను చూసి అర్థం చేసుకోవచ్చు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com