ఏపీ అభివృద్ధి పథంలో పయనించాలంటే చంద్రబాబు రావాలి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. ఇదిలావుంటే నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో కొనసాగుతోంది. లోకేశ్ ఈ మధ్యాహ్నం మద్దిపాడు మండలం గుండ్లాపల్లిలో వృత్తి నిపుణులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన వర్కింగ్ ప్రొఫెషనల్స్ తమ సమస్యలను నారా లోకేశ్ కు విన్నవించారు. దీనిపై లోకేశ్ స్పందించారు. జగన్ బాధితుల్లో అన్ని రంగాల నిపుణులు ఉన్నారని వెల్లడించారు. ఉపాధ్యాయులు, డాక్టర్లు, న్యాయవాదులు... ఇలా వివిధ రంగాల వారు జగన్ వల్ల బాధలు పడుతున్నారని వివరించారు. జగన్ ఎవరినీ వదలడంలేదని అన్నారు. ఏపీ అభివృద్ధి పథంలో పయనించాలంటే చంద్రబాబు రావాలి అని లోకేశ్ స్పష్టం చేశారు.
ప్రజావేదిక కూల్చివేతతో జగన్ విధ్వంస పాలన ప్రారంభమైందని అన్నారు. అమర్ రాజా, రిలయన్స్, లులూ వంటి సంస్థలను రాష్ట్రం నుంచి తరిమేశారని ఆరోపించారు. ఈ నాలుగేళ్లలో రాష్ట్రానికి ఒక్క మంచి కంపెనీ అయినా వచ్చిందా? అని ప్రశ్నించారు. జగన్ విద్యా వ్యవస్థను ధ్వంసం చేశారని విమర్శించారు. జగన్ రూ.10 ఇచ్చి రూ.100 లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఇక, టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్ గా తీర్చిదిద్దుతామని లోకేశ్ హామీ ఇచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా పరిశ్రమలు తీసుకువస్తామని తెలిపారు. విద్యార్థులకు పాత ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. యూపీఎస్ ఎసీ తరహాలో ఏపీపీఎస్సీని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ, పెండింగ్ ప్రభుత్వ పోస్టులను భర్తీ చేస్తామని నిరుద్యోగులకు భరోసానిచ్చారు. విశాఖను ఐటీ రాజధానిగా అభివృద్ధి చేస్తామని లోకేశ్ వివరించారు. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తామని అన్నారు.