ఈసారి మనం గెలుపుపై కాదు... మెజారిటీపైనే దృష్టిపెట్టాలని పర్చూరు నియోజకవర్గ టీడీపీ శ్రేణులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. నాయకులు వస్తూ, పోతూ ఉంటారని... కార్యకర్తలే శాశ్వతమని ఆయన అన్నారు.
ప్రస్తుతం లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో కొనసాగుతోంది. గుండ్లాపల్లి క్యాంప్ సైట్ లో ఇవాళ ఆయన పర్చూరు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎండా, వానను తట్టుకుని ఇప్పటివరకు 2,200 కి.మీ. పాదయాత్ర పూర్తిచేశానని వెల్లడించారు. ఐదు కోట్లమంది ప్రజల ఆశీస్సులు, టీడీపీ కుటుంబసభ్యుల ప్రోత్సాహమే తనను ముందుకు నడిపిస్తోందని అన్నారు.
"టీడీపీ కార్యకర్తలకు ఇబ్బంది వస్తే నేరుగా పార్టీనే స్పందిస్తోంది. ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తలకు సంక్షేమ నిధితో పాటు బీమా కల్పించాం. జిల్లాలో పెద్దాయన అని చెప్పుకుని తిరిగిన వ్యక్తి పార్టీ మారారు... కానీ కార్యకర్తలు మారలేదు. గత నాలుగేళ్లలో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు... చాలామంది అక్రమ కేసులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రం సరైన దారిలో లేదు. రాబోయే తరాలు బాగుండాలంటే చంద్రబాబు సీఎం అవ్వాలి.
మొదట టీడీపీ శ్రేణులపై దాడులు చేశారు, తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు చేశారు, ఇప్పుడు ఏకంగా పోలీసులపై కూడా దౌర్జన్యాలు చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల సమయం ఉంది. అందరం కలసి పోరాడి పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. పని చేసేవాళ్లను ప్రోత్సహిస్తా. 'మన బూత్... మన భవిష్యత్' కార్యక్రమం ద్వారా అందరూ ప్రతి బూత్ వారీగా పార్టీకి మెజార్టీ తీసుకురండి, మీ భవిష్యత్ నేను చూసుకుంటా" అని భరోసానిచ్చారు.