పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా? లేక టీడీపీ అధ్యక్షురాలా? అనే సందేహం వస్తోందని మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ఏం మాట్లాడితే పురందేశ్వరి కూడా అదే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏపీ అప్పుల్లో ఉందని పురందేశ్వరి అనడం హాస్యాస్పదమని అన్నారు. ‘‘అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ అప్పు తక్కువ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మరి మంత్రి చెప్పింది తప్పా? పురందేశ్వరి చెబుతున్నది తప్పా? స్పష్టత ఇవ్వాలి” అని అన్నారు.
‘‘టీడీపీ హయాంలోనే తలకుమించిన అప్పులు చేశారు. ఓ మ్యాప్ తీసుకుని చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న సమయంలో గాడిదలు కాశారా?” అని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమం, అభివృద్ధి గుర్తుకురావని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయనకు అభివృద్ధి గుర్తుకు వస్తుందని విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు నదుల అనుసంధానం కన్నా నిధుల అనుసంధానంపైనే ఎక్కువ దృష్టి పెట్టారని సెటైర్లు వేశారు.
పవన్ కల్యాణ్ పార్టీ పెట్టింది ప్యాకేజీల కోసమేనని మంత్రి రోజా ఫైరయ్యారు. ‘‘ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యం ఉంటే రాష్ట్రంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చు. పవన్ కల్యాణ్ పార్టీ స్థాపించి తొమ్మిదేళ్లయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. చంద్రబాబును సీఎం చేయడమే పవన్ ధ్యేయం” అని ఎద్దేవా చేశారు.