ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలో ఉన్న జ్ఞానవాపి సముదాయం విషయం కోర్టు పరిధిలో ఉండగా.. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్.. తీవ్ర వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. జ్ఞానవాపి సముదాయాన్ని మసీదు అని పిలవడమే అతి పెద్ద వివాదం అని తెలిపారు. జ్ఞానవాపి సముదాయంలో హిందూ ఆలయానికి సంబంధించిన గుర్తులు ఉన్నాయని యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. అందులో ఉన్న విషయాలని దేశ ప్రజలు తెలుసుకోవాలని భావిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా పోయిందేమీ లేదని.. ముస్లిం వర్గాలు వచ్చి.. వారు చేసిన చారిత్రక తప్పిదాన్ని ఒప్పుకోవాలని అన్నారు. అయితే కోర్టులో పరిధిలో ఉండగా.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర సంచలనంగా మారింది.
ఇటీవల ఏఎన్ఐ ఎడిటర్ ఇన్ చీఫ్ స్మితా ప్రకాష్.. ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన యోగి ఆదిత్యనాథ్ జ్ఞానవాపి సముదాయం వివాదంపై స్పందించారు. అది ముమ్మాటికీ హిందువులదేనని.. దానిపై మసీదు నిర్మించారని వ్యాఖ్యానించారు. ఆ జ్ఞానవాపి సముదాయంలో హిందూ దేవుళ్ల విగ్రహాలు, త్రిశూలం, జ్యోతిర్లింగం కూడా ఉందని తెలిపారు. అందుకే జ్ఞానవాపి సముదాయాన్ని మసీదు అని పిలవలేమని పేర్కొన్నారు. దాన్ని మసీదు అని పిలవడమే అతి పెద్ద వివాదం అని చెప్పారు. ఇప్పటికైనా ముస్లిం సమాజం అర్థం చేసుకోవాలని సూచించారు. జరిగింది ఒక చారిత్రక తప్పిదం అని ఒప్పుకుని.. జ్ఞానవాపి సముదాయంపై ఒక పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయాలని హితవు పలికారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలే సంచలనంగా మారాయి. తాజాగా యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలకు అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్.. మద్ధతు పలికారు.
జ్ఞానవాపి ఆవరణలో ఏఎస్‌ఐ సర్వేపై స్టే విధించిన అలహాబాద్ హైకోర్టు.. దాన్ని ఆగస్టు 3 వ తేదీ వరకు పొడిగించింది. వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆగస్టు 3 వ తేదీనే తీర్పు వెలువరించనున్నట్లు తెలిపింది. అప్పటివరకు తీర్పును రిజర్వ్‌లో ఉంచుతున్నట్లు అలహాబాద్ హైకోర్టు వెల్లడించింది. అంతకుముందు జ్ఞానవాపి సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే నిర్వహించాలంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. కోర్టు స్టే విధించింది. దీంతో జ్ఞానవాపి సముదాయంలోకి వెళ్లిన 30 మంది ఏఎస్ఐ సర్వే అధికారులు.. వెనక్కి వచ్చాశారు.
జ్ఞానవాపి సముదాయంలో మసీదు ఉండేదని ముస్లింలు వాదిస్తుండగా.. అందులో హిందూ ఆలయం ఉండేదని దాన్ని కూల్చి మసీదు నిర్మించారని హిందువులు చెబుతున్నారు. ఇప్పటికీ ఆ సముదాయంలో హిందూ దేవతల విగ్రహాలు, ఆనవాళ్లు ఉన్నాయని హిందూ సంఘాలు చెబుతున్నాయి. 2021 లో ఓ హిందూ మహిళ.. తమను కూడా ఆ జ్ఞానవాపి సముదాయంలో పూజలు చేసుకునేందుకు అనుమతి కల్పించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించడంతో ఈ వివాదం మొదలైంది. అప్పటి నుంచి వివిధ కోర్టుల్లో విచారణ జరిగిన ఈ కేసు.. చివరకు సుప్రీంకోర్టుకు కూడా చేరింది. తాజాగా ఆ జ్ఞానవాపి సముదాయంలో ఒకప్పుడు హిందూ ఆలయం ఉండేదా లేక మసీదు ఉండేదా అని నిర్ధారించేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా - ఏఎస్ఐ అధికారులు సర్వే నిర్వహించాలని ఆదేశించిన కోర్టు మళ్లీ దానిపై స్టే విధించింది. ఈ క్రమంలోనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది.