టమాటా ధరల పెరుగుదల ఓ వైపు ప్రజలను అల్లాడిస్తుంటే.. వాటికి సంబంధించిన కొన్ని వింత ఘటనలు కూడా దేశంలో చోటు చేసుకుంటున్నాయి. దాదాపు 2 నెలలుగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో టమాటా ధరలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కిలో టమాటా రూ. 200 పలుకుతుండటంతో సామాన్యులు కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. అయితే తాజాగా ఓ ప్రబుద్ధుడు.. టమాటాల కోసం ఇద్దరు పిల్లల్ని కుదువ పెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అది కూడా ఆ ఇద్దరు పిల్లల్ని కూలీ కోసం తీసుకురావడం గమనార్హం. కూరగాయల దుకాణంలోకి వెళ్లిన ఓ వ్యక్తి.. 4 కిలోల టమాటాలను కొనుగోలు చేశాడు. అనంతరం డబ్బులు తీసుకువస్తానని చెప్పి.. అప్పటివరకు ఇద్దరు పిల్లలు ఇక్కడే ఉంటారని చెప్పి వెళ్లాడు. ఎంతకీ ఆ వ్యక్తి రాకపోవడంతో అనుమానం వచ్చిన కూరగాయల దుకాణం యజమాని పిల్లల్ని ప్రశ్నించడంతో అసలు విషయం బయటికి వచ్చింది.
ఒడిశాలోని కటక్ నగరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తాను వాషింగ్ మెషీన్ కొనుగోలు చేశానని.. దాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు కూలీలు కావాలని ఇద్దరు పిల్లలను తీసుకువెళ్లాడు. వారికి రూ. 300 చొప్పున కూలీ ఇస్తానని చెప్పాడు. అది నమ్మిన ఆ చిన్నారులు.. అతనితో వెళ్లారు. మార్గమధ్యలో ఛట్రా బజార్‌లో ఉన్న ఓ కూరగాయల దుకాణానికి వెళ్లాడు. అక్కడ 4 కిలోల టమాటాలు కొనుగోలు చేశాడు. మరో 10 కిలోలు కావాలని అడిగాడు. అయితే తన వద్ద డబ్బులు లేవని.. ఈ 4 కిలోల టమాటాలు తన బంధువులకు ఇచ్చి డబ్బులు తీసుకువస్తానని చెప్పాడు. అప్పటి వరకు ఆ ఇద్దరు పిల్లలను అక్కడే ఉంచుతానని కూరగాయల దుకాణం యజమానికి చెప్పి వెళ్లాడు. అయితే ఆ పిల్లలు.. ఆ వ్యక్తి బిడ్డలే అని నమ్మిన ఆ కూరగాయల దుకాణం ఓనర్ ఏమీ అనలేదు.
అయితే డబ్బులు తీసుకువస్తా అని 4 కిలోల టమాటాలు తీసుకువెళ్లిన వ్యక్తి ఎంత సేపటికీ రాలేదు. దీంతో 2 గంటల తర్వాత అనుమానం వచ్చిన ఆ కూరగాయల దుకాణం యజమాని చివరకు ఆ ఇద్దరు పిల్లలను ప్రశ్నించాడు. అయితే ఆ వ్యక్తి ఎవరో తమకు తెలియదని.. కూలీకి రమ్మంటే వచ్చామని బదులు ఇవ్వడంతో కూరగాయల దుకాణం ఓనర్ షాక్‌కు గురయ్యాడు. అతడిని చూడటం ఇదే మొదటిసారి అంటూ వారు అసలు విషయం చెప్పడంతో ఆ వ్యక్తికి ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకున్నాడు. ప్రస్తుతం ఒడిశాలో కిలో టమాటా ధర రూ.240 దాకా పలుకుతోంది. ఇలాంటి సమయంలో ఈ ఘటన జరగడం అక్కడ హాట్ టాపిక్ అయ్యింది. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు.. ఆ వ్యక్తిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారులను తాకట్టు పెట్టి టమాటాలు తీసుకెళ్లిన వ్యక్తిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కామెంట్లు చేస్తున్నారు.