కడుపు నొప్పి అంటూ ఆస్పత్రికి వచ్చిన బాలుడికి పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు షాక్ అయ్యారు. అతని కడుపులో 2 కిలోల పిండం ఉన్నట్లు గుర్తించారు. దీంతో అత్యవసరంగా అరుదైన ఆపరేషన్ చేపట్టి.. ఆ పిండాన్ని విజయవంతంగా తొలగించారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నగరంలో బయటికి వచ్చింది. ప్రయాగ్‌రాజ్ నగరంలో ఉన్న సరోజినీ నాయుడు చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. 4 గంటల పాటు శ్రమించి 7 నెలల బాలుడి కడుపు నుంచి 2 కిలోల పిండాన్ని తొలగించారు. ఇది చాలా అరుదుగా జరిగేదని.. 10 లక్షల మందిలో ఒకరికి వస్తుందని డాక్టర్లు వెల్లడించారు. దీని "ఫేటస్ ఇన్ ఫేటు" అంటారని వివరించారు. డాక్టర్ డి. కుమార్ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం ఈ శస్త్రచికిత్సను నిర్వహించింది. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వివరించారు. ప్రయాగ్‌రాజ్ నగరంలో ఇలాంటి ఆపరేషన్‌ను చేయడం ఇదే తొలిసారి అని సరోజినీ నాయుడు పిల్లల ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలోని కుందా ప్రాంతంలో నివసించే రైతు కుమారుడికి ఈ అరుదైన వ్యాధి సోకింది. అయితే ఆ బాలుడు కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. అయితే జులై 24 వ తేదీన కడుపు నొప్పి మరింత తీవ్రం కావడంతో స్థానికంగా ఉన్న స్వరూప్ రాణి నెహ్రూ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి ప్రయాగ్‌రాజ్‌లోని సరోజినీ నాయుడు చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. అక్కడ సీటీ స్కాన్ చేసిన డాక్టర్లు.. కడుపులో పిండం ఉన్నట్లు గుర్తించారు. బాలుడి తల్లి జన్మనివ్వగానే చనిపోయిందని తెలిపారు. అయితే బాలుడి కడుపు చాలా ఉబ్బిందని.. దీంతో తీవ్ర కడుపు నొప్పి వస్తోందని చెప్పినట్లు వెల్లడించారు.
ఫేటస్ ఇన్ ఫేటు అనేది పుట్టుకతో వచ్చే చాలా అరుదైన లోపం. అయితే తల్లి కడుపులో కవలలుగా ఉండే పిల్లలు.. ఒకరి శరీరంలోకి వెళ్లి మరొకరు ఉంటారు. తల్లి గర్భాశయంలో కవలలు వృద్ధి చెందుతున్న దశలో ఏర్పడే వైకల్యం కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతాయని వైద్యులు వివరించారు.ఇది చాలా అరుదైనదని పది లక్షల మందిలో ఒకరికి సంభవిస్తుందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం బాలుడి కడుపులో ఉన్న 2 కిలోల పిండానికి చేతులు, పాదాలు, వెంట్రుకలు కూడా ఉన్నాయన్నారు. దీని పట్ల అప్రమత్తంగా లేకపోతే కిడ్నీల నుంచి రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుందని వెల్లడించారు.