ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో తెగల మధ్య హింసాత్మక ఘటనలతో దేశం మొత్తం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. హర్యానాలో మత ఘర్షణలు ఒక్కసారిగా మొదలయ్యాయి. తాజాగా హర్యానాలో చెలరేగిన మత ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. 200 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. నుహ్ జిల్లాలో చెలరేగిన ఈ మత ఘర్షణలు.. పక్కన ఉన్న ప్రాంతాలకు కూడా వ్యాపించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీంతో నుహ్ జిల్లాలో ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు విధించారు. మరోవైపు.. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ విజ్ఞప్తి చేశారు.
హర్యానాలోని నుహ్ జిల్లాలో సోమవారం.. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గురుగ్రామ్ - అల్వార్ జాతీయ రహదారిపై బ్రిజ్ మండల్ జలాభిషేక యాత్ర చేపట్టారు. బీజేపీ జిల్లా శాఖ అధ్యక్షుడు గార్గి కక్కర్, బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రపై నుహ్‌లోని ఖేద్లా మోడ్ వద్ద ఓ అల్లరి మూక రాళ్లు విసరడంతో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. దీంతో ఇరు వర్గాలు రాళ్లు విసురుకున్నాయి. చూస్తుండగానే విధ్వంసం సృష్టించారు. కార్లు, ఇళ్లు, మతపరమైన భవనాలకు నిప్పంటించారు. ఈ రాళ్ల దాడిలో హోంగార్డులు నీరజ్, గురుసేవక్ దుర్మరణం పాలయ్యారు. నుహ్‌లో ఘర్షణలు జరిగాయన్న వార్తలతో సోహ్నాలో రెండు మతాలకు చెందినవారు ఘర్షణలకు దిగారు. అక్కడి రోడ్లపై బైఠాయించి.. వాహనాలను ధ్వంసం చేశారు. ఈ యాత్ర కోసం దాదాపు 2500 మంది నుహ్ జిల్లాకు వచ్చారని.. ఘర్షణలతో వారంతా ఆలయం వద్ద చిక్కుకుపోగా.. సాయంత్రం వారిని పోలీసులు రక్షించారని తెలిపారు.
హర్యానాలో మత ఘర్షణలు చెలరేగిన వేళ.. గురుగ్రామ్, ఫరీదాబాద్‌లలోని పాఠశాలలు, కళాశాలలను మంగళవారం మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గురుగ్రామ్, నుహ్‌లలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. పారామిలిటరీ, హర్యానా ఎస్‌టీఎఫ్ బలగాలను మోహరించినట్లు భివానీ పోలీసు సూపరింటెండెంట్ నరేంద్ర బిజర్నియాన్ తెలిపారు. పరిస్థితిని హర్యానా డీజీపీ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని వెల్లడించారు. ఈ ఘటనపై స్పందించిన హర్యానా హోం మంత్రి అనిల్ విజ్.. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరారు. నుహ్ జిల్లాకు అదనపు బలగాలను పంపిస్తున్నట్లు తెలిపారు. నూహ్ జిల్లాలో ప్రస్తుతం కర్ఫ్యూ విధించినట్లు హోం మంత్రి అనిల్ విజ్ తెలిపారు.
ఘటనలు చెలరేగిన నుహ్ జిల్లాలో శాంతి కమిటీ చర్చలు జరిగాయి. ఇరు వర్గాలకు చెందిన నేతలు.. నుహ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో భేటీ అయి.. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పే చర్యలు చేపట్టారు. హర్యానాలో చెలరేగిన మత ఘర్షణలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ హెచ్చరించారు. ఇది చాలా దురదృష్టమైన ఘటన అని.. ఈ సమయంలో హర్యానా ప్రజలంతా సంయమనం పాటించాలని కోరారు. ఈ ఘర్షణలపై 20 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. నిందితుల్ని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు హర్యానా సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో హర్యానా హోంమంత్రి అనిల్ విజ్, రాష్ట్ర డీజీపీ పాల్గొన్నారు.
సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక అభ్యంతరకమైన వీడియో ఈ మత ఘర్షణలకు కారణం అని అధికారులు భావిస్తున్నారు. ఈ వీడియోను భజరంగ్ దళ్ కార్యకర్త ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియోను భజరంగ్ దళ్ సభ్యుడుడ మోను మనేసార్, అతని అనుచరులు కొన్ని రోజుల క్రితం బాగా వైరల్ చేసినట్లు సమాచారం. భివానీలో ఇద్దరు ఇతర వర్గం వారిని చంపిన కేసులో నిందితుడిగా ఉన్న మోను మానేసర్.. యాత్రలో పాల్గొనేందుకు వచ్చినట్లు గుర్తించిన ఆందోళన కారులు ఆ యాత్రపై రాళ్లు రువ్వడంతో ఘర్షణలు జరిగినట్లు తెలుస్తోంది.