చాలా మంది యువతీయువకులు తమ ప్రేమ విషయాన్ని చెప్తే ఇంట్లో ఒప్పుకుంటారో లేదో అని భయపడుతూ ఉంటారు. ఒకవైపు వారి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నా మరోవైపు వారి కుటుంబాలు నిరాకరించడంతో ఆగిపోయిన ప్రేమ పెళ్లిళ్లు ఎన్నో ఉన్నాయి. కొన్ని జంటలు మాత్రం వారి ఇంట్లో ఒప్పుకోకున్నా.. ప్రేమించినవారిని విడిచిపెట్టడం ఇష్టం లేక అన్నీ వదిలేసి లవ్ మ్యారేజ్‌లు చేసుంటూ ఉన్నారు. మరికొందరు ఇంట్లో ఒప్పించలేక.. ప్రేమించినవారిని వదల్లేక.. సూసైడ్ చేసుకుంటున్న ఘటనలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఇలాంటి లవ్ మ్యారేజ్‌లకు కూడా తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకోవాలనే నిబంధనను ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే యోచనలో ఉంది. ఈ మేరకు దీని సాధ్య, అసాధ్యాలపై అధ్యయనం మొదలు పెట్టినట్లు స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే ప్రకటించడంతో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గుజరాత్ ప్రభుత్వం ఈ కొత్త తరహా నిబంధనకు శ్రీకారం చుట్టింది. ప్రేమ పెళ్లిళ్లకు తప్పనిసరిగా తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు.. స్వయంగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రకటించారు. దీని కోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థను తీసుకొచ్చేందుకు గుజరాత్ ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు. దీనికి తోడు ఈ అంశంపై తమ ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని సీఎం భూపేంద్ర పటేల్ వెల్లడించారు. దీంతో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ చేసిన ప్రకటన కేవలం ఆ రాష్ట్రంలోనే కాకుండా ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. అయితే గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్పందించింది. లవ్ మ్యారేజ్‌లకు పేరెంట్స్ పర్మిషన్ తప్పినిసరి చేస్తూ భూపేంద్ర పటేల్ సర్కార్ బిల్లు తీసుకువస్తే తాము సంపూర్ణ మద్దతు తెలుపుతామని హస్తం పార్టీ ప్రకటించింది. దీంతో ఇది మరింత చర్చకు తెరలేపింది.
అయితే గుజరాత్‌లో ఉన్న పాటీదార్ సామాజిక వర్గం నుంచి ఎప్పుటి నుంచో ఈ డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే వారి పిల్లలు చేసుకున్న లవ్ మ్యారేజ్‌ను అధికారికంగా గుర్తించాలనే నిబంధనలను తీసుకురావాలంటూ పాటీదార్ సామాజికవర్గం నుంచి డిమాండ్లు ఉన్నాయని స్వయంగా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ వెల్లడించారు. పాటీదార్ వర్గానికి ప్రాతినిధ్యం వహించే సర్దార్ పటేల్ గ్రూప్.. మెహ్సానాలో నిర్వహించిన సమావేశానికి సీఎం భూపేంద్ర పటేల్ హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో మాట్లాడిన భూపేంద్ర పటేల్ ఈ వ్యాఖ్యలు చేశారు. లవ్ మ్యారేజ్‌లకు వారి తల్లిదండ్రుల అంగీకారం ఉండాలన్న అంశానికి సంబంధించి అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. దీనికి రాజ్యాంగ పరంగా అవకాశం ఉందా లేదా అనేది పరిశీలిస్తామని చెప్పారు. . రాజ్యాంగబద్ధంగా ఇది సాధ్యమైతే ఈ ప్రతిపాదనను వెంటనే అమలులోకి తెస్తామని పేర్కొన్నారు.