జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర తదుపరి విడత విశాఖపట్నం నుంచి ప్రారంభం కానున్నట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. గురువారం వారాహి యాత్ర విజయవంతం చేయడానికి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులతో నాదెండ్ల సన్నాహక సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు విడతల్లో నిర్వహించిన వారాహి విజయ యాత్ర విజయవంతంగా సాగిందన్నారు. అంతకు మించిన స్థాయిలో విశాఖ నగరంలో చేసే యాత్ర ఉండాలని తెలిపారు. నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అంతా సమష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు. వారాహి యాత్ర ఉద్దేశాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లాలన్నారు. యాత్రలో భాగంగా జనవాణి కార్యక్రమం విశాఖలో ఉంటుందని తెలిపారు. క్షేత్ర స్థాయి పరిశీలనలు చేపట్టి, సంబంధిత ప్రజలతో పవన్ కళ్యాణ్ సమావేశమై సమస్యలను తెలుసుకుంటారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.