కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో దంపతులు విడిపోతున్నట్టు ప్రకటించారు. తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్టు జస్టిన్ ట్రూడో (51), ఆయన సతీమణి సోఫీ గ్రెగోయిర్ (48) తమ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లు పెట్టారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు చాలా అర్థవంతమైన, కష్టతరమైన చర్చలు జరిపినట్టు ఇరువురూ తెలిపారు. అయితే ఎప్పటిలాగే తమ మధ్య ఏర్పడిన లోతైన ప్రేమ, గౌరవం మున్ముందు కూడా కొనసాగుతాయని పేర్కొన్నారు. పిల్లల శ్రేయస్సును గౌరవిస్తూ వారి గోప్యతకు భంగం కలగకుండా చూడాలని సూచించారు.
సోఫీతో ట్రూడోకి 2005లో వివాహం జరగ్గా.. ఈ జంటకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ‘ఇరువురూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు.. సోఫీ, ప్రధాన మంత్రి తమ పిల్లలను సురక్షితమైన, ప్రేమపూర్వక, సహకార వాతావరణంలో పెంచడంపై దృష్టి సారించారు.. వచ్చే వారం కుటుంబం వెకేషన్‌కు వెళ్లనుంది’ అని కెనడా ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మూడేళ్ల కిందట 2020 నాటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా.. భార్య సోఫీని పొగడ్తల్లో ముంచెత్తిన ట్రూడో.. ‘ఆమె నా భాగస్వామి..నా బెస్ట్ ఫ్రెండ్’ అని అభివర్ణించారు. కాగా, ట్రూడో దంపతుల నిర్ణయంపై వారి అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ‘విడాకులు పిల్లలను విచ్ఛిన్నం చేస్తాయి’ అరి పలువురు వ్యాఖ్యానించారు.
కాగా, 2015లో అధికారం చేపట్టిన తర్వాత ట్రూడోకు ఎదురైన అతి పెద్ద వ్యక్తిగత సంక్షోభాలలో ఇది ఒకటి. ఎన్నికల్లో తన లిబరల్ పార్టీ స్థానాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఇటీవలే క్యాబినెట్‌ను పునర్వవస్థీకరించారు. జనాదరణలో వెనుకబడినప్పటికీ 2025 అక్టోబరులో జరగనున్న ఎన్నికల్లో పార్టీకి నాయకత్వం వహించాలని ట్రూడో నిశ్చయించుకున్నారు. కాగా, ప్రధాని హోదాలో ఐదేళ్ల కిందట 2018 ఫిబ్రవరిలో ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌లో తొలిసారి పర్యటించారు. కుటుంబసమేతంగా వచ్చిన కెనడా అధికారిక పర్యటనకు నరేంద్ర మోదీ ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అప్పట్లో వ్యాఖ్యలు వినిపించాయి. ట్రూడో, ఆయన కుటుంబం పర్యటనను ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులు చాలా వరకు విస్మరించారనే వాదనలు ఉన్నాయి. ట్రూడో ఢిల్లీలో విమానం దిగినప్పుడు ఆయనకు ఒక జూనియర్ మంత్రి స్వాగతం పలికారు. దీనిని ప్రస్తావిస్తూ కెనడా ప్రధాని స్థాయికి తగిన గౌరవం ప్రభుత్వం ఇవ్వలేదని చాలా మంది విమర్శించారు. అయితే, కెనడాలో ఖలీస్థాన్ సానుభూతిపరులకు జస్టిన్ ట్రూడో ప్రభుత్వం మద్దతు పలుకుతుందనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఆయనను పట్టించుకోలేదనే వాదన ఉంది.