అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని క్యాపిటల్ సెనేట్ భవనాల్లోకి ఆయుధాలతో ఓ అగంతకుడు ప్రవేశించినట్లు సమాచారం రావడంతో కలకలం రేగింది. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు.. ఆ భవనాలను తమ ఆధీనంలోకి తీసుకొని ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. రస్సెల్ సెనేట్ భవనం, ఇతర సెనెట్ భవనాల్లో జల్లెడ పట్టారు. అయితే, సాయుధుడైన వ్యక్తి ఎవరూ లేరని నిర్ధారణకు రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 2.30 గంటల సమయంలో ఆయుధాలు కలిగి ఉన్న ఓ వ్యక్తి క్యాపిటల్ సెనేట్ భవనాల్లో సంచరిస్తున్నట్లు ఎమర్జెన్సీ నెంబరు 911కి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు.
దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఆ భవనాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భవనాల్లో ఉన్నవారిని ఖాళీచేయించి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. ‘క్యాపిటల్ సెనేట్ కార్యాలయాల భవనాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ ప్రాంతం సమీపంలోకి ఎవరూ రావద్దు.. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు మీతో సమాచారం పంచుకుంటాం’ అని క్యాపిటల్ పోలీసులు ట్వీట్ చేశారు. విస్తృత గాలింపుల అనంతరం సాయుధుడైన వ్యక్తి ఎవరూ లేరని, భయపడాల్సిన అవసరం లేదని ప్రకటించారు. భయభ్రాంతుకు గురిచేసేందుకే బెదిరింపు ఫోన్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఫోన్ చేసిన ఆగంతుకుడ్ని పట్టుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అమెరికా క్యాపిటల్ పోలీస్ చీఫ్ థామస్ మాంజర్ మాట్లాడుతూ.. ఇది బోగస్ కాల్ అని అన్నారు. సెనేట్ కార్యాలయ కార్యాలయ భవనాల్లోకి సిబ్బందిని తిరిగి పంపించడం కోసం సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ‘తిరిగి కార్యకలాపాలు ప్రారంభానికి సెనేట్ కార్యాలయ భవనాలను సిద్ధం చేయడానికి అండగా నిలుస్తోంది. ఈ సమయంలో ఎటువంటి క్రియాశీల ముప్పు లేదు’ అని క్యాపిటల్ పోలీస్ ట్వీట్ చేసింది. అంతేకాదు, సెనేట్ కార్యాలయ భవనాల్లో ఎటువంటి కాల్పులు కూడా చోటుచేసుకోలేదని తెలిపింది.
అమెరికాలో గన్ కల్చర్ హింసాత్మక ఘటనలు పెరుగుతున్నందున లైసెన్స్ ఆయుధాలను కొనుగోలు చేసే వయసును 18 నుంచి 21కి పెంచాలని అధ్యక్షుడు జో బైడెన్ పదే పదే చెబుతున్నారు. ‘తుపాకీ సంబంధితనేరాలను తగ్గించడానికి దేశానికి మరిన్ని వనరులు అవసరమని, సామూహిక కాల్పుల పెరుగుదల మధ్య ఆయుధాలను నిషేధించడానికి ఇది సరైన సమయం’ అని అన్నారు. దీనికి సంబంధించిన చట్టాలను సవరించాల్సి ఉందని అన్నారు. అయితే, కాంగ్రెస్‌లో రిపబ్లికన్ సభ్యులు సంఖ్యా బలం ఎక్కువ ఉండటంతో బిల్లును తీసుకురావడం కష్టంగా మారింది.