గుంటూరు జిల్లా తెనాలిలోని వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో రాత్రి సమయంలో నలుగురు దొంగలు ఆలయం గోడ దూకారు.. లోపలికి వెళ్లి ఓ లాకర్ తెరిచే ప్రయత్నం చేశారు. ఇంతలో ఆలయ సిబ్బంది అప్రమత్తమై 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి దొంగల్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. పైకప్పు నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా.. వారిని పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్ రమేష్ 12 అడుగుల ఎత్తు నుంచి కిందిపడ్డాడు.
కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. టౌన్ పోలీసులు నలుగురిలో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.. మరో ఇద్దరు మాత్రం పారిపోయారు. ఈ దొంగలు హుండీ, ఆలయంలో నగలు మాత్రం టచ్ చేయలేదు.. విచిత్రంగా లాకర్‌లో ఉన్న తలనీలాలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించడం విశేషం. ఆలయాల్లో చోరీలు, హుండీలు ఎత్తుకెళ్లిన ఘటనలు చూశాం.. కానీ ఇలా విచిత్రంగా తలనీలాల కోసం రావడం చర్చనీయాంశమైంది.
వెంకటేశ్వరస్వామి ఆలయానికి ప్రతి రోజూ భక్తులు తరలివస్తుంటారు. వారిలో కొందరు తలనీలాలు సమర్పిస్తారు.. వాటిని లాకర్‌లో భద్రపరుస్తారు. వాటిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు.. ఇంతలో శబ్దాలు రావడంతో సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆలయంలో కేశాలను దొంగలించే ప్రయత్నం చేయడం గురించి తెలియడంతో స్థానికులు సైతం ఒకింత ఆశ్చర్య పోయారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.