విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో పనుల నిమిత్తం రాత్రి సమయంలో రన్‌వేను మూసివేస్తున్నారు. రక్షణశాఖ ఆధ్వర్యంలో విశాఖ విమానాశ్రయంలో పదేళ్లకోసారి నవీకరణ పనులు చేపడతారు. రన్‌వే పునరుద్ధరణ కోసం పనులు జరుగుతుండటంతో నాలుగు నెలలకు పైగా రాత్రి సమయంలో విమానాలు నిలిపివేసే అవకాశం ఉంది. ఈ పనుల్ని నవంబర్ 15 నుంచి మార్చి నెలాఖరు వరకు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో రన్ వేను రాత్రి 9 నుంచి ఉదయం 8 వరకు మూసివేయాలని ప్రతిపాదించారట
రన్ వే మూసివేయడంతో విశాఖ - సింగపూర్ విమానంతో పాటు , 12 సర్వీసులు నిలిచిపోతాయంటున్నారు. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ విమాన సేవలతో పాటు కోల్‌కతా, పుణె విమాన సేవలకు అంతరాయం కలగనుంది. ఈ సమయంలో విమానాశ్రయాన్ని రాత్రి 10.30 నుంచి ఉదయం 6.30 వరకు పరిమితం చేస్తే కొంతవరకు ఉపశమనం ఉంటుందని భావిస్తున్నారు.
విశాఖ ఎయిర్పోర్టు నేవీ అధీనంలో ఉంది. నేవీకి సంబంధించిన యుద్ధ విమానాలు, ఎయిర్క్రాఫ్ట్లు ఐఎన్ఎస్ డేగా రన్వే నుంచే కార్యకలాపాలు సాగిస్తాయి. పౌర విమానాల ల్యాండింగ్, టేకాఫ్ కూడా ఈ రన్ వే మీదుగానే జరుగుతాయి. అందుకే ప్రతి పదేళ్లకు ఓసారి తమ రన్వేలకు రీ-సర్ఫేసింగ్ పనులను చేపడుతుంటారు. ఈ ఏడాది కూడా ఆ పనుల్ని చేపడుతున్నారు.