అమృత్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా తొలి దశలో ఏపీలోని 18 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే రూ.453.5 కోట్లను ప్రభుత్వం కేటాయించగా.. ఈ పనులకు ప్రధాని మోదీ స్వయంగా శంకుస్ధాపన చేయనున్నారు. ఆదివారం వర్చువల్ విధానంలో పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
ఉదయం 11 గంటలకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యం కోసం అన్ని సదుపాయాలు కల్పించనున్నారు. లిప్టులు, సీటింగ్ కోసం బెంచీలు, ఎస్కలేటర్లు, ఒక ఫ్లాట్‌ఫామ్ నుంచి మరో ఫ్లాట్‌ఫామ్‌కు వెళ్లడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఫ్లాట్‌ఫాంల విస్తరణ వంటి పనులను చేపట్టనున్నారు. ఈ పనుల ద్వారా రైల్వే స్టేషన్లను సుర్వాంగ సుందరంగా ఆధునీకరించనున్నారు. రైల్వే స్టేషన్లకు ఆకర్షణీయంగా ముఖద్వారం నిర్మించనున్నారు. ఏపీలోని 72 రైల్వే స్టేషన్లు ఎంపికవ్వగా.. మొదటి ఫేజ్‌లో 18 రైల్వే స్టేషన్లను తీర్చిదిద్దనున్నారు.
సింగరాయకొండ, తెనాలి, తాడేపల్లిగూడెం, తుని, ఒంగోలు, భీమవరం టౌన్, కాకినాడ టౌన్, నిడదవోలు, నర్సాపురం, ఏలూరు, అనకాపల్లితో పాటు పలు రైల్వే స్టేషన్లను అత్యాధునిక సౌకర్యాలతో ఆధునీకరణ చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాదిలో 1275 రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలని నిర్ణయించారు. రైల్వే స్టేషన్లలో ఎలాంటి పనులు చేపట్టాలనే దానిపై సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా ప్రజల అభిప్రాయాలను రైల్వేశాఖ కోరుతోంది. ట్విట్టర్ హ్యాట్‌ట్యాగ్, మెయిల్ ద్వారా వివరాలు పంపాలని సూచించింది.