టమాటా ధరలు తగ్గేదే లేదంటున్నాయి. రూ.50 నుంచి రూ.100కు.. రూ.100 నుంచి రూ.150కు.. అలా మెల్లిగా రూ.200 దాటేసింది. సామాన్యుడు టమాటా పేరు ఎత్తితేనే భయపడాల్సిన పరిస్థితి.. అయితే రైతులకు మాత్రం భారీగా లాభాలు తెచ్చిపెడుతోంది టమాటా. రూ.కోట్లలో ఆదాయం వచ్చిందని సంబరపడుతున్న రైతులకు ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చి పడింది. కొద్దిరోజులుగా దొంగల బెడద పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఏకంగా టమాటా తోటల్లోకి చొరబడి పంటను ఎత్తుకెళ్తున్నారు. కష్టపడి పంట సాగు చేస్తే దొంగల పాలయ్యిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టమాటా పంటను ఎక్కువగా చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తుంటారు. ధరలు కూడా పెరగడంతో చాలామంది తోటలకు వెళ్లి టమాటాలను ఎత్తుకెళుతున్నారు. టమాటాల కోసం వచ్చిన వాళ్లు కూడా రాత్రి సమయాల్లో రావడంతో దొంగలను గుర్తించడం కష్టంగా మారిందంటున్నారు రైతులు. అప్పులు చేసి పండించిన పంట దొంగల పాలవుతున్నాయని.. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో దొంగలు తోటల్లో టమాటాలను ఎత్తుకెళుతున్నారు. దాదాపు టన్ను వరకు టమాటలను అపహరించినట్లు రైతులు చెబుతున్నారు.
రెండు రోజుల క్రితం కనగానపల్లి మండలంలో ఓ రైతు తోటలో కోతకొచ్చిన తొలి పంటను దొంగలు ఎత్తుకెళ్లారు. తోటల్లో కోతలు చేసి విక్రయిద్దామనుకున్న సమయంలో చోరీ జరగడంతో రైతు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు పగటి సమయంలో తోటల్ని గమనిస్తున్నారు. రాత్రి సమయంలో వెళ్లి తోటల్లో చొరబడి టమాటాలను ఎత్తుకెళ్లారు. కొన్ని తోటల్లో టమాటాలు పక్వానికి రాలేదని రైతులు కాపలాగా వెళ్లడం లేదు.. దొంగలు ఆ పచ్చి టమాటాలను కూడా వదలడం లేదు.
ఇటీవల అన్నమయ్య జిల్లాలో ఓ టమాటా రైతును గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపారు. టమాటాలు అమ్మిన డబ్బులు ఉంటాయనే ఉద్దేశంతోనే దాడి చేసి హతమార్చారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగడంతో ఒంటరిగా పొలం వెళ్లేందుకు భయపడుతున్నారు అన్నదాతలు. ఓ వైపు టమాటాలతో లాభాలు వస్తున్నాయనే ఆనందం ఉంటే.. మరోవైపు దొంగల బెడదతో భయపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.