టీటీడీ ఛైర్మన్‌గా మరోసారి అవకాశం దక్కడంపై తిరుపతి ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. టీటీడీ ఛైర్మన్‌గా అవకాశం రావడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అవకాశం లభించిందని, ఇప్పుడు మళ్లీ జగన్ ప్రభుత్వంలో పదవి లభించడం హ్యాపీగా ఉందన్నారు. తండ్రి, కొడుకుల పాలనలో టీటీడీ ఛైర్మన్‌గా అవకాశం దక్కడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
టీటీడీ ప్రతిష్టను పెంచుతానని, తిరుమల పవిత్రతను కాపాడుతానని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. స్వామివారి వైభవం, హిందూ ధార్మికతను ప్రజల్లోకి మరింతగా తీసుకెళతానని, హిందూ ధార్మికత విషయంలో అధికారులతో కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు. టీటీడీ అడ్మినిస్ట్రేషన్ విషయంలో తలదూర్చనని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ టీటీడీ ఛైర్మన్ పదవి దక్కదని, రెండోసారి లభించినందుకు మరింత ఆనందంగా ఉందన్నారు.
జగన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సామాన్య భక్తుల కోసం పనిచేస్తానని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. టీటీడీకి మంచి పేరు తీసుకొస్తానని, హిందూ ధర్మ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానన్నారు. 15 సంవత్సరాల తర్వాత మళ్లీ తనకు ఛైర్మన్ పదవి వచ్చిందని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల వల్లనే తనకు లభించిందన్నారు.
కాగా టీటీడీ ఛైర్మన్ పదవీకాలం రెండేళ్లపాటు ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైవీ సుబ్బారెడ్డిని చైర్మన్‌గా నియమించగా.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఆయన పదవిని పొడిగించారు. ఆగస్టు 8తో టీటీడీ పాలకమండలి గడువు ముగస్తుంది. దీంతో కొత్త పాలకమండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఎన్నికల నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డిని పార్టీ కోసం ఉపయోగించుకోవాలని జగన్ అనుకుంటున్నారు. అందులో భాగంగా టీటీడీ ఛైర్మన్‌గా కొత్తవారికి అవకాశం కల్పించాలని జగన్ భావించారు. దీంతో రేసులో పలువురి పేర్లు వినిపించాయి. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీ, బీసీ నేత జంగా కృష్ణమూర్తి పేర్లు బయటకొచ్చాయి. కానీ చివరికి భూమనకు పదవి దక్కింది.