జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మనేశ్ గుర్జార్‌ను పదవి నుంచి తప్పిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం (శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీచేసింది. ఓ స్థలానికి సంబంధించిన లీజు వ్యవహారంలో ఆమె భర్త లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో ఆమెను కూడా పదవి నుంచి తొలగించింది. అంతేకాదు, ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న 43 వ నెంబరు వార్డు కార్పొరేటర్ పదవి నుంచి కూడా సస్పెండ్ చేసింది. మేయర్ మునేశ్ భర్త సుశీల్ గుర్జార్ .. ఓ భూమి లీజ్ వ్యవహారంలో రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ శనివారం ఏసీబీ అధికారులకు బుక్కయ్యారు.
మేయర్ స్వగృహంలోనే ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆ సమయంలో ఆమె అక్కడే ఉన్నారు. ఆ ఇంటి నుంచి ఏసీబీ అధికారులు రూ.40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. లంచం వ్యవహారంలో మేయర్ హస్తం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కేసు విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో ఆమెపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో నారాయణ్ సింగ్, అనిల్ దూబే అనే మరో ఇద్దరిని కూడా ఏసీబీ అదుపులోకి తీసుకుని, విచారిస్తోంది. నారాయణ్ సింగ్ నివాసంలోనూ మరో రూ.8 లక్షల నగదు లభ్యమైంది. ఈ ఘటనతో మరోసారి అధికార కాంగ్రెస్‌పై ప్రతిపక్ష బీజేపీ విమర్శలను ఎక్కుపెట్టింది. ఇది దోపిడీ, అబద్ధాల ప్రభుత్వమని మండిపడింది.
రాజస్థాన్‌లో ఈ ఏడాది శాసనసభ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌కు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఇప్పటికే ‘రెడ్ డెయిరీ’ వ్యవహారం రాజస్థాన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టేసింది. ఇది దోపిడి, అబద్ధాల ప్రభుత్వమని, సీఎం కాళ్లకు కాదు కళ్లకు కట్టు ఉందని బీజేపీ దాడి చేసింది. ఇటీవల సీఎం గెహ్లాట్ కాలికి గాయమైన విషయం తెలిసిందే. బీజేపీ విమర్శలను సీఎం తిప్పికొట్టారు. రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ మేయర్ భర్తను అరెస్టు చేయడం అవినీతిపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందనడానికి నిదర్శనమని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఎదురుదాడికి దిగారు.
రాజస్థాన్‌లో మాత్రమే ఏసీబీ ఇలా పనిచేస్తుందని, ఇతర రాష్ట్రాల్లో అనుమతి లభించదని, కలెక్టర్, ఎస్పీ, రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను, ఇప్పుడు మేయర్ భర్తను అరెస్ట్ చేశామని వివరించారు. మున్సిపల్ కార్పొరేషన్ జైపూర్ హెరిటేజ్‌లో కాంగ్రెస్ పాలకపక్షం ఉంది. జూన్‌లో మునేశ్ గుర్జార్, మరికొందరు కాంగ్రెస్ కౌన్సిలర్లు అప్పటి కార్పొరేషన్ కమిషనర్‌కి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ఆయన అవినీతికి పాల్పడ్డారని, సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ధర్నా కూడా చేయడం గమనార్హం. ఇక, 2019లో జనాభా ఎక్కువగా ఉన్నారనే కారణంతో కోటా, జైపూర్ వంటి నగరాల్లో రెండు మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటుచేసింది. రాజకీయంగా బీజేపీకి సాంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న నగరాల్లో కాషాయ పార్టీని దెబ్బతీయడానికే కాంగ్రెస్ ఎత్తుగడగా అప్పట్లో భావించారు.