కడప జిల్లా, పీలేరు హంద్రీ-నీవా కాలువలో అనుమానాస్పద స్థితిలో ఒక బాలిక మృతదేహం లభించినది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని, అది హత్య, లేక ఆత్మహత్య అని దర్యాప్తు చేపడతామని తెలియజేసారు. వివరాల్లోకి వెళ్ళితే.... గుర్రంవారిపల్లెకు చెందిన ఉప్పు రమణ, మేనక దంపతులు కుమార్తె అయిన కీర్తి పీలేరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇంటి నుంచి కాలేజీకి వెళుతూ ఖాళీ సమయాల్లో వ్యవసాయ పనుల్లో కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో గుర్రంవారిపల్లె సమీపంలోని తమ వరి పొలానికి నీళ్లు కట్టడానికి వెళ్లి ఉదయం 10 గంటలైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు, సమీప బంధువులు ఆమె కోసం పొలం వద్దకు వెళ్లారు. ఆమె అక్కడ లేకపోవడం, సెల్‌ఫోన స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళనకు గురై చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతుకులాట ప్రారంభించారు. వారి పొలానికి కాసింత దూరంలో ఉన్న హంద్రీ-నీవా కాలువలో ఆమె చెప్పులు కనపడడంతో అనుమానమొచ్చి కాలువలో వెతికారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో కాలువలోని బురదలో తలకిందులుగా కూరుకుపోయిన స్థితిలో కీర్తి శరీరం వారి కంట పడింది. దీంతో కంగారుపడిన వారు ఆమెను కాలువలో నుంచి వెలికితీసి ప్రాణంతో ఉన్నదే మోనని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆమె చనిపోయిందని నిర్ధారించుకుని గ్రామ సమీపంలోని పొలంలో మృతదేహాన్ని పెట్టి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం సదుం పోలీసులు ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో గుర్రంవారిపల్లెకు చేరుకుని ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే కీర్తి పొలానికి వెళ్లిన సమయంలో గుర్రంవారిపల్లెకు చెందిన యువకుడు కూడా ఆ ప్రాంతంలో కనిపించాడని, ప్రస్తుతం ఆ యువకుడు, అతని కుటుంబీకులు గ్రామం నుంచి అదృశ్యమయ్యారని, ఆ యువకుడే కీర్తిని ఏమైనా చేసి ఉంటాడనే అనుమానాలను గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు.