విశాఖలో హనీట్రాప్ కలకలంరేపింది. స్టీల్ ప్లాంట్ సెక్యూరిటీ విధుల్లో ఉన్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కపిల్ కుమార్ జగదీష్ భాయ్ మురారీ పాకిస్తాన్ మహిళ తమీషా హనీట్రాప్‌లో పడ్డారు. తమీషా అనే మహిళతో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. అతడి కదలికలపై ఉన్నతాధికారులకు అనుమానం రావడంతో నిఘా పెట్టారు. కేంద్ర నిఘా సంస్థల సమాచారంతో కపిల్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని.. అతడి మొబైల్స్‌ను స్వాధీనం చేసుకుని సీఐఎస్ఎఫ్ ఫోరెన్సిక్ విచారణకు పంపించింది. తదుపరి విచారణ కోరుతూ స్టీల్ ప్లాంట్ పోలీస్‌స్టేషన్‌లో సీఐఎస్ఎఫ్ యూనిట్ ఇంఛార్జ్ ఫిర్యాదు చేశారు.
అధికారిక రహస్యాలు ఉల్లంఘన నేరం క్రైమ్ నెంబర్ 61/2003 సెక్షన్ 4,9 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అంతరంగిక భద్రతకు సంబంధించిన వ్యవహారం కావడంతో వివిధ ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. కపిల్ కుమార్ 2002 నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్యూరిటీ విధుల్లో ఉన్నారు. అంతకు ముందు రక్షణ రంగంలో కీలకమైన భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో విధులు నిర్వహించారు. కీలక సమాచారం పాకిస్తాన్ గూఢచార సంస్థకు చేరినట్టు అనుమానిస్తున్నారు. అత్యంత గోప్యంగా విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
గతంలో కూడా విశాఖపట్నంలో గూఢచర్యం కేసులో షేక్ అబ్దుల్ రెహమాన్ జబ్బార్‌ని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో అబ్దుల్ రహమాన్ భార్య సంతా జిన్ను కూడా అరెస్ట్ అయ్యారు. సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్ అమ్మాయిల పేర్లతో విశాఖ నేవీ దళ సభ్యులకు ఎరవేసి దేశ రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకు కుట్ర పన్నారనే విషయం తెలుసుకున్న ఎన్ఐఏ.. ఆపరేషన్ డాల్ఫిన్ నోస్ పేరుతో లోతుగా దర్యాప్తు చేపట్టారు.
విచారణలో భాగంగా విజయవాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే 11 మంది నేవీ అధికారులు సహా మొత్తం 14 మందిని అరెస్ట్ చేశారు. తర్వాత మరో సూత్రధారిని అరెస్ట్ చేసి కీలక డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. వీరి ద్వారానే నేవీ అధికారులకు డబ్బులు చేరవేసినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఇప్పుడు తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ హనీట్రాప్ కేసు సంచలనంగా మారింది. ఈ దర్యాప్తులో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయన్నది చూడాలి.