తెలుగు పోలీస్‌కు గుజరాత్‌లో అత్యంత అరుదైన గౌరవం లభించింది. ట్రాన్స్‌ఫర్ అయి వెళ్తున్న ఎస్పీకి స్థానికులు ఘనంగా వీడ్కోలు పలికారు. వివిధ వర్గాల ప్రజలు వచ్చి.. ఆయనకు బిగ్ సెండాఫ్ ఇచ్చారు. ఆయనే ఎస్పీ వాసం శెట్టి రవితేజ. ఇప్పటివరకు జునాగఢ్ ఎస్పీగా పనిచేసిన రవితేజ ఇటీవలె గాంధీనగర్‌కు బదిలీ అయ్యారు. పూల వర్షం కురిపించారు. కార్లతో ర్యాలీగా పంపించారు. ఇక ఆయన వెళ్తున్న కారుకు మొత్తం పూల దండలు వేసి.. అలంకరించారు.
వాసం శెట్టి రవితేజ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నంలంక గ్రామం. 2015 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రవితేజ గత మూడేళ్లుగా జునాగఢ్ ఎస్పీగా విధులు నిర్వర్తించారు. అయితే ఇటీవల గుజరాత్‌లో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలను ప్రభుత్వం చేసింది. ఇందులో భాగంగానే రవితేజను జునాగఢ్ నుంచి గాంధీ నగర్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. పోలీసు విభాగంలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న రవితేజ.. అందరి మన్ననలు అందుకున్నారు. తాను కేవలం ఎస్పీగా విధులు నిర్వర్తించడమే కాకుండా జునాగఢ్ ప్రజలకు ఎంతో దగ్గర అయ్యారు. వారికి అను నిత్యం అండగా.. ఉంటూ పోలీస్‌గానే కాకుండా సొంత మనిషిలా మారిపోయారు. అందుకే ఆయన ట్రాన్స్‌ఫర్ అయి వెళ్తుంటే రవితేజ మీద ఉన్న అభిమానాన్ని వారు ఇలా బయటపెట్టారు.
అయితే ట్రాన్స్‌ఫర్ అయి గాంధీనగర్‌కు వెళ్తున్న ఎస్పీ రవితేజకు జునాగఢ్ వాసులు ఘనంగా, భిన్నంగా వీడ్కోలు పలికారు. ఈ వీడ్కోలు కార్యక్రమం ఎస్పీ ఆఫీస్ నుంచి ప్రారంభమైంది. ముందుగా పూలతో అలంకరించిన కారులో ఎస్పీ రవితేజను కూర్చోబెట్టారు. అక్కడి నుంచి పోలీసు కాన్వాయ్ జునాగఢ్ వీధుల నుంచి పట్టణం దాటింది. ఈ సమయంలో జునాగఢ్ ప్రజలు ఎస్పీ రవితేజకు వీడ్కోలు పలికేందుకు రోడ్డుపైకి వచ్చి పూల వర్షం కురిపించారు. అంతకుముందు ఆయనకు దండలు వేసి.. బహుమతులు, షీల్డ్‌లు అందించారు. తమను వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉందంటూ కన్నీరు కార్చారు.
అనంతరం జునాగఢ్ నుంచి గాంధీనగర్‌కు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చిన ఎస్పీ రవితేజకు అక్కడ కూడా స్థానికులు పూలవర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో రవితేజ అందించిన సేవలకు గుర్తుగా అప్పటి గుజరాత్ డిప్యూటీ సీఎం నవీన్ పటేల్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని కూడా అందుకున్నారు. అయితే తమ ప్రాంతానికి చెందిన రవితేజకు.. గుజరాత్ పోలీస్ శాఖలో ఇంతటి పేరు ప్రఖ్యాతులు రావడంపై కోనసీమ జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.