మోదీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో పడిన శిక్షపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఎంపీగా అనర్హత వేటు రద్దయింది. దీంతో తిరిగి రాహుల్‌కు లోక్‌సభ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ పునరుద్ధరించింది. ఈ నిర్ణయాలన్నీ చకచకా జరిగిపోయాయి. అనర్హత వేటు రద్దయి.. సభ్యత్వం తిరిగి పొందడంతో రాహుల్.. పార్లమెంటు గడప తొక్కారు. అయితే తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. రాహుల్ గాంధీకి ఇల్లు కేటాయించాలని కాంగ్రెస్ నేతలు.. పార్లమెంటు హౌస్ కమిటీకి లేఖ రాశారు. అయితే ఒకసారి పార్లమెంటు సభ్యత్వంపై వేటు పడి.. ఇల్లు ఖాళీ చేసిన సభ్యుడికి మళ్లీ ఇల్లు ఇవ్వాలంటే నిబంధనలు ఏం చెప్తున్నాయి. అసలు రాహుల్‌కు ఇల్లు కేటాయించాలంటే ఏ నియమాలు పాటించాలనేది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
అయితే రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్న సమయంలో ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో రాహుల్ నివాసం ఉండేది. శిక్ష పడి లోక్‌సభ సభ్యత్వం రద్దు కావడంతో ఆ ఇంటిని ఖాళీ చేయాలని రాహుల్‌కు నోటీసులు అందాయి. దీంతో ఆయన ఆ నివాసాన్ని ఖాళీ చేశారు. అయితే తాజాగా శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించడం.. తిరిగి రాహుల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్దరించడంతో ఇల్లు కేటాయిస్తారా లేదా అనే దానిపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. అయితే గతంలో రాహుల్ నివాసం ఉన్న తుగ్లక్ రోడ్డులో ఉన్న ఇంటిని తిరిగి కేటాయించాలని.. కాంగ్రెస్ పార్టీ తరఫున.. లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి.. తాజాగా పార్లమెంట్ హౌసింగ్ కమిటీకి లేఖ రాశారు. అయితే నిబంధనల ప్రకారం రాహుల్ గాంధీయే స్వయంగా లేఖ రాయాలని.. అలా చేస్తేనే ఆయనకు నివాసాన్ని కేటాయించే అంశాన్ని పరిశీలిస్తామని కమిటీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం బయటికి రాలేదు.
మోదీ ఇంటి పేరుకు సంబంధించి 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో మాట్లాడిన రాహుల్ గాంధీపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ.. గుజరాత్‌లోని సూరత్ సెషన్స్‌కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన సూరత్ సెషన్స్ కోర్టు రాహుల్ గాంధీకి 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం మార్చి 4న లోక్‌సభ సెక్రటేరియేట్ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసింది. ఈ క్రమంలోనే ఎంపీగా అనర్హత వేటు పడటంతో రాహుల్ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి 10 జన్‌పథ్ రోడ్డులోని తన తల్లి సోనియా గాంధీ ఇంట్లో ఉంటున్నారు.
అయితే రాహుల్ గాంధీ ఖాళీ చేసిన తుగ్లక్ రోడ్డులోని ఇంటిని ఇప్పటి వరకు ప్రభుత్వం ఎవరికీ కేటాయించలేదు. దీంతో ఆ ఇంటిని తిరిగి రాహుల్‌కే కేటాయిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు.