మణిపూర్ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో హింసాత్మక ఘటనల కారణంగా బాధితులైన వారి పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని నియమించింది. బాధితులకు సహాయం, పునరావాస సౌకర్యాలు అందుతున్న పరిస్థితిని ఈ కమిటీ పర్యవేక్షించనుంది. ముగ్గురు హైకోర్టు మాజీ జడ్జిలతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు.. మణిపూర్‌లో జరిగిన అల్లర్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఆ రాష్ట్ర డీజీపీ.. ధర్మాసనం ముందు స్వయంగా హాజరయ్యారు.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాత్మక సంఘటనలకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మణిపూర్ బాధితుల సహాయ, పునరావాస పర్యవేక్షణను ఈ త్రిసభ్య కమిటీ పరిశీలించనుందని పేర్కొంది. ఈ ముగ్గురు సభ్యుల కమిటీకి జమ్మూ కశ్మీర్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ గీతా మిత్తల్ నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో బాంబే హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ షాలినీ పీ జోషి.. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆశా మేనన్‌లు సభ్యులుగా ఉంటారని ధర్మాసనం పేర్కొంది. మణిపూర్ రాష్ట్రంలో చట్టబద్ధపాలనపై విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. ఈ కమిటీ బాధితుల పర్యవేక్షణతోపాటు విస్తృతంగా విచారణ చేపడుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీబీఐకి బదిలీ చేయని కేసులను 42 సిట్‌లు చూస్తాయని.. ఈ సిట్‌లను మణిపూర్ రాష్ట్రానికి బయట డీఐజీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారని ధర్మాసనం తెలిపింది. ప్రతి పోలీస్ అధికారి ఆరు సిట్‌లను పర్యవేక్షిస్తారని.. అప్పుడే దర్యాప్తు సరిగ్గా జరుగుతుందని కోర్టు స్పష్టం చేసింది.
మణిపూర్ అల్లర్లకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. ఈ సందర్భంగా గత వారం సుప్రీం కోర్టు అడిగిన వివరాలకు సంబంధించిన నివేదికలను వారు ధర్మాసనానికి అందించారు. వాటిని కోర్టు పరిశీలించనుంది. మరోవైపు.. మణిపూర్ డీజీపీ ప్రత్యక్షంగా కోర్టు ముందు హాజరు కావాలని గత విచారణలో సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆ రాష్ట్ర డీజీపీ రాజీవ్ సింగ్ కూడా సోమవారం.. సుప్రీంకోర్టుకు వచ్చారు. మణిపూర్‌కు సంబంధించి పూర్తి వివరాలను సీజేఐ నేతృత్వంలోని బెంచ్‌కు వివరించారు. మణిపూర్‌లో చెలరేగిన హింస, అల్లర్లను అడ్డుకునేందుకు, చెలరేగకుండా ఆపేందుకు ఇప్పటివరకు ప్రభుత్వం, అధికారులు తీసుకున్న చర్యలను కోర్టుకు విన్నవించారు. మణిపూర్‌లో చెలరేగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తు జరిపేందుకు ఆయా జిల్లా ఎస్పీల నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేటీవ్ టీమ్-సిట్‌లను ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సుప్రీంకోర్టు దృష్టికి మణిపూర్ డీజీపీ రాజీవ్ సింగ్ తీసుకెళ్లారు.