దేశ ఐటీ రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం. అసలే ఇరుకైన రహదారులు.. ఆపై వాహనాల రద్దీని దాటుకొని, గమ్యస్థానాలకు చేరడానికి కొన్ని గంటలు పడుతుంది. ఇక, చినుకుపడితే బెంగళూరు నగరవాసులకు నరకమే. ట్రాఫిక్ కష్టాల గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు తాము ఎదుర్కొన్న అనుభవాలను పంచుకుంటూనే ఉంటారు. ఇలా ట్రాఫిక్ అంతరాయం, వాహనాల రద్దీ, సిగ్నళ్ల వద్ద వేచి ఉండటం వంటి వాటి కారణంగా సమయం, ఇంధనం వృథా అయి బెంగళూరు నగరానికి ఏటా దాదాపు రూ.20 వేల కోట్ల నష్టం వాటిల్లుతోంది. ట్రాఫిక్ నిపుణుడు ఎంఎన్ శ్రీహరి, ఆయన బృందం నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యింది.
రహదారి ప్లానింగ్, ఫ్లైఓవర్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, మౌలిక సదుపాయాల లోటు వంటి అంశాలను ఈ బృందం పరిశీలించి.. నివేదికను రూపొందించింది. నగరంలో పూర్తిస్థాయిలో పనిచేసే దాదాపు 60 ఫ్లైఓవర్లు ఉన్నప్పటికీ.. బెంగళూరు (Bengaluru) నగరం ఏటా రూ.19,725 కోట్ల భారీ నష్టాన్ని చవిచూస్తోందని అధ్యయన నివేదిక పేర్కొంది. ఐటీ వృద్ధితో నగరంలో ఉపాధి అవకాశాలు పెరుగుతుండటం వల్ల నివాసం, విద్య వంటి ఇతర సౌకర్యాలు మెరుగవుతున్నాయని సర్వే తెలిపింది. పెరిగిన 14.5 మిలియన్ల భారీ జనాభాకు అనుగుణంగా.. వాహనాల సంఖ్య 1.5 కోట్లకు చేరువలో ఉంది.
అయితే, దానికి తగ్గట్టుగా రహదారుల విస్తరణ లేదని ఆ బృందం నొక్కిచెప్పింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుంటూ వేగంగా పెరుగుతోన్న జనాభాకు తగ్గట్టు మౌలిక సదుపాయాల కల్పన సరిపోవడం లేదని, ఆ వ్యత్యాసమే ఈ ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమవుతోందని పేర్కొంది. అంచనాల ప్రకారం 2023 నాటికి బెంగళూరు 88 చదరపు కిలోమీటర్ల నుంచి 985 చదరపు కిలోమీటర్లకు విస్తరిస్తుంది. ఈ అధ్యయనం నగరాన్ని 1,100 చదరపు కిలోమీటర్లకు విస్తరించాలని ప్రతిపాదించింది.
‘మరోవైపు.. రహదారి పొడవు పెరుగుదల వాహనాల పెరుగుదల, విస్తీర్ణం అనులోమానుపాతంలో లేదు.. రహదారి మొత్తం పొడవు సుమారు 11,000 కిలోమీటర్లు.. ఇది మా రవాణా డిమాండ్.. చేసిన ప్రయాణాలకు సరిపోదు’ అని నివేదిక పేర్కొంది. ‘జనాభా పెరుగుదల, వారి ఉద్యోగ సంభావ్య వేగం ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాల పెరుగుదలతో సరిపోలలేదు.. ట్రాఫిక్ ఆలస్యం, రద్దీ, అధిక ప్రయాణ సమయం, ప్రత్యక్ష, పరోక్ష ఖర్చుల పరంగా భారీ ఆర్థిక నష్టం ఏర్పడింది’ శ్రీహరి బృందం అన్నారు.
నగరానికి రేడియల్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్లు అవసరమని, ప్రతి 5 కి.మీకి ఒక వృత్తాకార మార్గానికి కూడా రేడియల్ రోడ్ల ద్వారా అనుసంధానించాలని శ్రీహరి చెప్పారు. రాబోయే 25 ఏళ్లపాటు రోడ్డు ట్రాఫిక్‌ను తీర్చడానికి మరిన్ని భూగర్భ ఆధారిత రహదారి వ్యవస్థలను నిపుణులు సూచించారు. మెట్రోలు, ప్రభుత్వ బస్సులు ప్రతి 1-2 కి.మీకి తెరవబడే భూగర్భ రవాణాను ప్రభుత్వం అన్వేషించాల్సిన అవసరం ఉందని అధ్యయనం స్పష్టం చేసింది.
కాగా, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. బెంగళూరు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాల గురించి వివరించారు. ఆ అంతరాయాలను తొలగించేందుకు వీలుగా వివరణాత్మక నివేదికను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రి.. శివకుమార్‌కు సూచించారు. ఈ క్రమంలోనే శ్రీహరి బృందం ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు ప్లానింగ్‌పై శివకుమార్‌కు నివేదిక ఇచ్చింది.